యువకుడి దారుణ హత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఆదివారం ఓ హత్య జరిగింది. స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఓ వివాదం హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ సినిమా రోడ్డులో త్రీ టౌన్ పీఎస్ ఎదురుగా ఉన్న వీధిలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్న మీసాల గౌతమ్(25) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించి తల్లిదండ్రులతో ఘర్షణ పడి ఇంటి నుంచి వెళ్లిపోయి, రేచర్లపేటలో గుర్రాల వారి వీధిలో యువతి ఇంట్లో నెల రోజులుగా ఆమెతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం యువతి ఇంటి నుంచి ఆటో నిలిపి ఉంచిన ప్రదేశానికి వెళ్లి స్టార్ట్ చేయబోతుండగా గౌతమ్‌కు తెలిసిన దుర్గాప్రసాద్, నవీన్, ఇమ్రాన్, సన్నీ అనే వ్యక్తులు ఆటో వద్దకు వచ్చారు. వారి మధ్య డబ్బుకు సంబంధించిన వాదన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారి తీయగా నలుగురు యువకులు గౌతమ్‌పై దాడి చేశారు. రాయి, ఇనుపరాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టడంతో గౌతమ్ అక్కడే కుప్పకూలి పోయాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రియురాలు గౌతమ్ సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పగా కుటుంబీకులు వచ్చి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గౌతమ్ మరణించాడు. ఇదిలా ఉంటే కుటుంబీకులు గౌతమ్‌ది ఉద్దేశపూర్వక హత్యేనని ఆరోపిస్తున్నారు. నలుగురు యువకులు గంజాయి, మద్యం సేవించి మత్తులో తూగుతూ ఘాతుకానికి పాల్పడ్డారని గౌతమ్ తల్లి, సోదరి అంటున్నారు. తన బిడ్డను కడతేర్చిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని తండ్రి కోరుతున్నారు. ఈ ఘటనపై కాకినాడ టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకులు పరారీలో ఉన్నారని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలు విచారణ చేపడుతున్నాయని అన్నారు.
రాయి, ఇనుపరాడ్డుతో
విచక్షణా రహితంగా దాడి
నిందితులు నలుగురూ పరారు


