వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
కాకినాడ సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాకినాడ ఈద్గా మైదానంలో ముస్లింలు సోమవారం నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ముస్లింలు తమ ఆస్తులను కాపాడుకోవడానికి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా స్థానిక ముస్లింలు భుజాలకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం ఆలోచనపరుల వేదిక కన్వీనర్ హసన్ షరీఫ్ మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ చట్టం అప్రజాస్వామికమని, రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ముస్లింలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
13 నుంచి తలుపులమ్మ తల్లి
గంధామావాస్య జాతర
తుని రూరల్: లోవ కొత్తూరులో తలుపులమ్మ అమ్మవారి గంధామావాస్య జాతర ఏప్రిల్ 13 నుంచి 27 వరకూ నిర్వహించనున్నట్లు లోవ దేవస్థానం ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై లోవ దేవస్థానం కార్యాలయంలో సోమవారం ఆయన లోవ కొత్తూరు గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 13న గరగలు తీయడంతో ఉత్సవాలు ప్రారంభించి, 26న జాగరణ నిర్వహిస్తామని తెలిపారు. 27న అమ్మవారి ఊరేగింపు, తీర్థం జరుపుతామన్నారు. ప్రతి సంవత్సరం లోవ కొత్తూరులో అమ్మవారి పుట్టింటి సంబరాలుగా గంధామావాస్య ఉత్సవాలు, ఆషాఢ మాసంలో లోవ దేవస్థానంలో ఉత్సవాలు చేయడం ఆనవాయితీ. ఈ సంవత్సరం గంధామావాస్య ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉత్సవాలకు అవసరమైన నిధులను దేవస్థానం నుంచి కేటాయించాలని గ్రామస్తులు కోరారు. ఉత్సవాల నిర్వహణలో గ్రామస్తులు ఐక్యంగా సహకరించాలని ఈఓ విశ్వనాథరాజు కోరారు. సమావేశంలో దేవస్థానం మాజీ చైర్మన్ దూలం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన


