మహోన్నతుడు వాజ్‌పేయి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన మహోన్నత వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయి విగ్రహాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సత్యనిష్టతో దేశానికి దిశానిర్దేశం చేసిన ఏకై క నేత వాజ్‌పేయి అని అన్నారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, స్వర్ణ చతుర్భుజి, గ్రామీణ సడక్ యోజన, సర్వశిక్షాభియాన్ వంటి అనేక పథకాలకు వాజ్‌పేయి శ్రీకారం చుట్టారని అన్నారు. అమెరికాను సైతం ఎదిరించి అణు పరీక్షలు నిర్వహించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


