ఫ శిరస్త్రాణం.. శిరో రక్షణం
ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ఎంతో మంది హెల్మెట్‌పై సరైన అవగాహన లేక.. ఉన్నా పెట్టుకోక.. ప్రమాదాలకు గురైనప్పుడు అర్ధాంతరంగా అసువులు బాస్తున్నారు. కుటుంబ సభ్యులకు తీరని క్షోభను మిగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ వాడకంపై వాహన చోదకులకు అవగాహన కల్పించే లక్ష్యంతో పోలీసులు ఆదివారం ఉప్పాడ బీచ్ రోడ్డులో వినూత్నంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ప్రాణ రక్షణ పొందాలని అన్నారు. ప్రాణరక్షణలో హెల్మెట్ పాత్ర, ప్రయోజనాలు, ట్రాఫిక్ నిబంధనలు, సేఫ్ డ్రైవింగ్, రోడ్డు ప్రమాదల నివారణ, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. లైసెన్సులు, ఇన్సూరెన్సులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు.
– కొత్తపల్లి


