ఉప్పాడలో వైఎస్ విగ్రహాష్కరణ
పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ.. పేదల పక్షపాతిగా నిలిచిన వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు, పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. జగన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో వైఎస్సార్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసీకుమార్, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు రావు చిన్నారావు, కారె శ్రీను, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. గీత ఆధ్వర్యాన శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకూ గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో గీత కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, దుర్గాడ, కొడవలి, వన్నెపూడి తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యాన జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. గొల్లప్రోలులో పార్టీ జిల్లా కార్యదర్శి అముజూరి రాంబాబు వృద్ధులకు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కొప్పన శివనాథ్, గండేపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పాడలో వైఎస్ విగ్రహాష్కరణ


