కల నెరవేరింది
కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామానికి చెందిన కర్రి చక్రధరరావు, విజయకుమారి దంపతులది పేద కుటుంబం. ముగ్గురు కుమారులు. కుటుంబ పోషణ కోసం గ్రామంలో చిన్న మెడికల్ షాపు నిర్వహించుకుంటున్నారు. పెద్దబ్బాయి పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. రెండో అబ్బాయి తమన్ సాయినందన్ కుటుంబానికి చేయూతగా ఉండాలని బీ ఫార్మసీ చేయాలని కలలు కన్నాడు. ఆర్థిక పరిస్థితి సహకరించక అతడిని చదివించేందుకు చక్రధరరావు దంపతులు వెనుకంజ వేశారు. అయితే, వారి మొరను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో దేవుడు ఆలకించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తమన్‌కు 2021లో భీమవరం విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సీటు వచ్చింది. డబ్బులిచ్చి చదివించే స్తోమత లేకున్నా నాడు జగన్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆదుకుంది. ఏడాదికి రూ.60,300 చొప్పున మొత్తం రూ.2,41,200 ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చింది. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం కూడా వచ్చింది. తమన్ సాయినందన్ ఇప్పుడు రాజమహేంద్రవరంలోని ఓ మెడికల్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ, ప్రతి నెలా రూ.27,500 జీతం పొందుతూ తమకు ఆసరాగా ఉన్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. మూడో కుమారుడికి కూడా జగన్ ప్రభుత్వ హయాంలోనే బీటెక్ సీటు వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో అతడు బీటెక్ చదువుతున్నాడు. జగనన్న వల్లనే తమ కుటుంబంలో ముగ్గురు అబ్బాయిలు ఉన్నత విద్య చదువుకోగలిగారని, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ చేదోడుగా ఉన్నారని చక్రధరరావు దంపతులు చెబుతున్నారు. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించిన జగన్ నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలని, మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. తన ఉన్నత చదువుల కలను నిజం చేసిన జగన్‌కు తమన్ సాయినందన్ కృతజ్ఞతలు చెబుతున్నారు.
– కాకినాడ రూరల్


