ఇల్లు ఇచ్చి.. సోదరిగా బట్టలు పెట్టారు
సామర్లకోట జగనన్న కాలనీకి చెందిన బండి విశాల భర్త సింహాచలం కోవిడ్ సమయంలో మరణించారు. ఎటువంటి ఉపాధీ లేక, దిక్కు లేని స్థితిలో ఉన్న ఆమె కుటుంబానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు రోడ్డులో ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా స్వయంగా ఆమె ఇంటిని ప్రారంభించారు. గృహప్రవేశ సమయంలో సోదరిగా భావించి, తనకు బట్టలు పెట్టడం ఎప్పటికీ మరచిపోలేనని విశాల చెమర్చిన కళ్లతో చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రినే ప్రజలు కోరుకుంటారని అన్నారు. మహిళా సంఘంలో సభ్యురాలు కావడంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఉచిత వడ్డీ సైతం ఆమెకు అమలు చేశారు. దీంతో నాలుగు వాయిదాల్లోనే విశాల రుణ బకాయి మొత్తం చెల్లించారు. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో ఇంటి నిర్మాణానికి రుణం సైతం సులభంగానే లభించింది. ప్రస్తుతం ఆ రుణ బకాయి ఉండటంతో నోటీసులు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే విశాల పెద్ద కుమార్తె మేఘన ఫీజు రీయింబర్స్‌మెంట్ సాయంతో బీఎస్సీ పూర్తి చేసి, డిప్లమో చేసింది. చిన్న కుమార్తె కీర్తిప్రియకు అమ్మ ఒడి పథకం అమలైంది. ప్రస్తుతం ఆమె బీకాం చదువుతోంది. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. తమ ఒక్క కుటుంబానికి ఇన్నివిధాల సాయం చేసిన జగన్ మేలును జీవితాంతం గుర్తుంచుకుంటామని, తమ ఆయుష్షు కూడా పోసుకుని, ఆయన నూరేళ్లు సంపూర్ణ జీవితం గడపాలని విశాల ఆకాంక్షించారు.


