తొలి తిరుపతికి భక్తుల తాకిడి
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వెలసిన శృంగార వల్లభ స్వామి వారిని శనివారం సుమారు 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,40,560, అన్నదాన విరాళాలు రూ.58,652, కేశఖండన ద్వారా రూ.3,080, తులాభారం ద్వారా రూ.100, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.16,860 కలిపి మొత్తం రూ.2,19,252 ఆదాయం వచ్చిందని వివరించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
24న రాష్ట్ర స్థాయి
క్రాస్ కంట్రీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ పోటీలు ఈ నెల 24న పెద్దాపురం లూథరన్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో లూథరన్ హైస్కూల్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.
ఆక్రమణలు తొలగించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్ పరిధిలోని కాలువలు, చెరువులు, డ్రైన్లపై ఆక్రమణలను గుర్తించి, ప్రణాళిక ప్రకారం తొలగించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెలా లక్ష్యం నిర్దేశించుకుని ఆక్రమణలు తొలగించాలన్నారు. కాలువలు, చెరువులు, డ్రైనేజీల్లో ప్రవాహానికి అడ్డు తగిలే తూడు, గుర్రపు డెక్క, ఇతర చెత్త తొలగింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనీష, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కాకినాడ ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
జనవరి 18న చలో ఖమ్మం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వచ్చే నెల 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శత వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేసేందుకు చలో ఖమ్మం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. చలో ఖమ్మం కరపత్రాలను స్థానిక పీఆర్ భవన్‌లో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీపీఐ శత వార్షికోత్సవాలు ఈ నెల 26తో పూర్తవుతాయన్నారు. ఖమ్మం సభకు జిల్లా నుంచి విద్యార్థులు, యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి 26 వరకూ వాడవాడలా సీపీఐ పతాకావిష్కరణలు, ప్రదర్శనలు, ఉత్సవాలు జరపాలని కోరారు. జిల్లా స్థాయి శత వార్షికోత్సవ ముగింపు బహిరంగ సభ ఈ నెల 27న సామర్లకోటలో జరగనుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఇంటింటి ప్రచారాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్పు వలన జరిగే నష్టాలపై పల్లె పల్లెనా కూలీలకు వివరించాలని, మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని కోరారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకుని విద్యాలయాల్లో సెమినార్లు, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మధు కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తొలి తిరుపతికి భక్తుల తాకిడి


