అన్నవరం: రాష్ట్రంలోనే గొప్పగా పేరొందిన సత్యదేవుని సన్నిధి నేడు వరుస వివాదాలతో ప్రతిష్ట మసకబారుతోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో ఏడు పుణ్యక్షేత్రాల్లో అన్నవరం చివరి ఏడో స్థానంలో దిగజారింది. మరలా ఫిబ్రవరిలో రెండో ర్యాంకుకు చేరినా, భక్తుల అసంతృప్తి గతం కంటే మరింత పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు రుజువు చేశాయి.
ర్యాంకుల వ్యవహారం ముగిసి వారం కూడా కాకుండానే, కొండ దిగువన సత్యనికేతన్ సత్రంలో సిబ్బంది, పోలీసులు బస చేసిన గదుల్లో బీరు సీసాలు దొరకడం సంచలనంగా మారింది. 62 గదులున్న సత్యనికేతన్ సత్రంలో ఎప్పుడూ భక్తులు పెద్దగా బస చేసిన దాఖలాల్లేవు. ఈ సత్రంలో ఎక్కువగా ఇతర దేవస్థానాల నుంచి బదిలీపై వచ్చిన సిబ్బంది, స్థానిక పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చిన సిబ్బంది బస చేస్తుంటారు. ఆ గదుల్లో ఆదివారం రాత్రి ఈఓ వీర్ల సుబ్బారావు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో పోలీసులు బస చేస్తున్న గదుల్లో బీరు సీసాలు దొరకడం, ఆయన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమాచారం ఇవ్వడం, అదే విధంగా ఆ పోలీసులను, దేవస్థానం సిబ్బందిని వెంటనే సత్రం గదులు ఖాళీ చేయాలని ఆదేశించడం సంచలనానికి దారి తీసింది.
డీఎస్పీ విచారణ
సత్రంలో మద్యం సీసాలు లభించిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సోమవారం విచారణ చేపట్టారు. బీరు సీసాలు లభించిన సత్రంలోని 23 నంబర్ గదిని పరిశీలించారు. అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. తర్వాత ఈఓతో మాట్లాడి, ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. సత్రంలో బీరు సీసాలు లభ్యమైన విషయమై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. ఇంటెలిజెన్స్ అధికారులు ఈఓని కలిసి, వివరాలు సేకరించారు.
పోలీసుల అసంతృప్తి!
సత్యనికేతన్ సత్రంలో పోలీసులు బస చేసిన గదుల్లోనే ఆకస్మిక తనిఖీలు చేసి, ఖాళీ బీరు బాటిళ్లున్నాయని వెంటనే కలెక్టర్, ఎస్పీలకు ఈవో సమాచారం ఇవ్వడంపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవి పాత సీసాలని, పోలీసులు మద్యం తాగుతూ పట్టుబడితే వేరని అంటున్నారు. ఖాళీ సీసాలు దొరికాయని చెప్పి రాద్ధాంతం చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ముందుగా స్థానిక పోలీసులకు లేదా పోలీస్ అధికారులకు సమాచారమిచ్చి ఉంటే, తామే చర్యలు తీసుకునేవారమని అంటున్నారు. వాస్తవానికి గతంలో కొంత మంది దేవస్థానం ఉద్యోగులు మద్యం సేవించి ఉండగా, వారిని పట్టుకుని కిందకు పంపేశామని, దేవస్థానం ప్రతిష్టని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి కేసులు నమోదు చేయలేదని వారంటున్నారు.
సత్యనికేతన్ సత్రంలో బీరు సీసాలపై విచారణకు కలెక్టర్ ఆదేశం
పోలీసులు బస చేసిన గదిలో డీఎస్పీ విచారణ
ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక
మసకబారిన అన్నవరం ప్రతిష్ట..!
మసకబారిన అన్నవరం ప్రతిష్ట..!
మసకబారిన అన్నవరం ప్రతిష్ట..!