
వినియోగదారుల ఉద్యమం మరింత పటిష్టం కావాలి
సభలో మాట్లాడుతున్న జేసీ రాహుల్ మీనా
కాకినాడ సిటీ: వినియోగదారుడే దేశ ఆర్థిక ప్రగతికి సూత్రధారుడని, వినియోగదారుల ఉద్యమం మరింత పటిష్టం కావాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాలు, లీగల్ మెట్రోలజీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి జేసీ రాహుల్ మీనా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో వినియోగ ఉద్యమం ప్రథమస్థానంలో ఉండడానికి వర్కుషాప్‌లు, సెమినార్ల ద్వారా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. మెంబర్ సుశి మాట్లాడుతూ ఉద్యమానికి వారధిలా పని చేస్తామన్నారు. జిల్లా సమాఖ్య చైర్మన్ భమిడి గిరిజా రమాదేవి మాట్లాడుతూ కన్జ్యూమర్ క్లబ్స్, మండల వినియోగ సమాచార కేంద్రాల్లో వినియోగ సంఘాల ద్వారా చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లా సప్లై అధికారి ఆర్‌ఎస్‌ఎస్ సీతారామరాజు మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు భమిడి శివమూర్తి, చాగంటి నాగేశ్వరరావు, ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీనివాసు, లీగల్ మెట్రోలజీ అధికారుల, ఆర్డీసీ డిపో, అన్నవరం సత్యదేవా మహిళా కళాశాల అధికారులు పాల్గొన్నారు. పలువురు వినియోగదారుల సంఘాల సభ్యులను సత్కరించారు.