అన్నవరం: ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉదయం 9 గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు యనమండ్ర శర్మ, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు వేణు, వ్రత పురోహితులు చెళ్లపిళ్ల ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. హోమంలో వంద మందికి పైగా భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. వారు కుటుంబ సభ్యులతో తరలి రావడంతో హోమ మండపం సరిపోక, కొంతమంది వెలుపల వేచి ఉండాల్సి వచ్చింది. వనదుర్గ ఆలయం ఎదురుగా హోమం నిర్వహించినపుడు కూడా గతంలో ఇదే సమస్య ఎదురవడంతో హోమాన్ని మండపం దిగువకు మార్చారు. అయినప్పటికీ సమస్య అలాగే ఉంది. దీంతో ఆలయానికి ఎదురుగా ఎక్కువ మంది భక్తులు పాల్గొనేందుకు వీలుగా హోమ మండపం నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన, కొండ దిగువన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం గోపి ఆధ్వర్యాన పండితులు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు.