
జిల్లా దేవదాయ శాఖ అధికారిగా సుబ్బారావు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయ శాఖ అధికారిగా ఇ.సుబ్బారావు కాకినాడలోని కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను జిల్లాలోని పలు దేవస్థానాలు, సత్రాల ఈఓలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జిల్లాలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌గా, జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో ఏఓగా పని చేసిన అనుభవం ఉందన్నారు. అర్చకులకు, ఈఓలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అర్జీదారుల
ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి
కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్య పరిష్కారంపై లబ్ధిదారు సంతృప్తి చెందారా లేదా అనే విషయంపై అభిప్రాయం తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ రాహుల్ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
17న వలంటీర్ల
‘చలో విజయవాడ’
కాకినాడ సిటీ: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లందరినీ కొనసాగించాలని, రూ.10 వేల వేతనం చెల్లించాలని, 9 నెలల బకాయిలు చెల్లించాలనే డిమాండ్లతో గ్రామ, వార్డు వలంటీర్లు ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కాకినాడ కచేరిపేటలోని సీఐటీయూ కార్యాలయం వద్ద బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష మంది మహిళలు పని చేసే వలంటీర్ల కడుపు కొట్టే ఉద్దేశం తనకు లేదని ఎన్నికల ముందు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమను కొనసాగించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలుకు వలంటీర్ వ్యవస్థ ఉండాలని, ఈ హామీలను అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు కాబట్టి వలంటీర్లను కొనసాగించడం లేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఈ నెల 17న వేలాదిగా వలంటీర్లు విజయవాడ తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, వలంటీర్ల సంఘం జిల్లా కో కన్వీనర్ ఇనుకోటి వరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అసంపూర్తి ఇళ్లకు
అదనపు సాయం
కాకినాడ సిటీ: పీఎంఏవై గ్రామీణ్, అర్బన్ 1.0లలో మంజూరై, వివిధ దశల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అదనపు ఆర్థిక సాయం అందించనున్నామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. గృహ నిర్మాణ పథకంపై వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో దాదాపు 7,108 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బీసీలు 4,852 మంది, ఎస్సీలు 2,131, ఎస్టీలు 125 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తామని చెప్పారు. వీటి నిర్మాణాలను ఏప్రిల్‌లోగా పూర్తి చేసుకోవాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి, ఇళ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా దేవదాయ శాఖ అధికారిగా సుబ్బారావు