
12న ఫీజు పోరును విజయవంతం చేయండి
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి
వంగా గీత
పిఠాపురం: రాష్ట్ర వైఎస్సార్ సీపీ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈనెల 12న నిర్వహించనున్న ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంగా గీత పిలుపు నిచ్చారు. ఆమె ఆదివారం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించిందని ఆమె విమర్శించారు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అండగా జిల్లా కేంద్రం కాకినాడలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తరపున చేపట్టనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదే రోజు పిఠాపురం పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు.
లోవ దేవస్థానంలో భక్తుల సందడి
రూ.3.65 లక్షల ఆదాయం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 18వేల మంది భక్తులు క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,39,305, పూజా టికెట్లకు రూ.86,900, కేశఖండన శాలకు రూ.13,960, వాహన పూజలకు రూ.3,890, వసతి గదులు, పొంగిలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.43,756, విరాళాలు రూ.77,609 వెరసి మొత్తం రూ.3,65,420లు ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు.
మోరి చేనేత వస్త్రాలకు రాష్ట్రపతి ప్రశంస
సఖినేటిపల్లి: జిల్లాలోని మోరి చేనేత సొసైటీ వస్త్రాలను ఆదివారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నేషనల్ డిజైన్ సెంటర్(సెట్ అప్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్) ఆధ్వర్యంలో సౌత్ ఇండియా అమృత్ మహోత్సవ్‌లో ఏపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మోరి చేనేత స్టాల్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోరి చేనేత సొసైటీ స్టాల్‌లోని చేనేత వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. ఆమె వెంట ఏపీ గవర్నర్ ఉన్నారు. చేనేత చీరల తయారీలో కార్మికుల నైపుణ్యాన్ని రాష్ట్రపతి ప్రసంశించినట్టు స్టాల్ సేల్స్‌మన్, మోరికి చెందిన నల్లా ప్రసాద్ తెలిపారు.