
26 స్వర్ణ, 19 రజత, 25 కాంస్య పతకాలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): తిరుపతిలో ఈ నెల 8 నుంచి 10 వరకూ జరిగిన రాష్ట్ర స్థాయి 42వ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 30 నుంచి 85 ఏళ్ల వయసు పురుషులు, మహిళల విభాగంలో రన్స్, త్రోస్, జంప్స్ పోటీలు నిర్వహించగా జిల్లా క్రీడాకారులు 26 బంగారు, 19 రజత, 25 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి మార్చ్‌ఫాస్ట్ విభాగంలో తృతీయ స్థానం పొందారు. ఈ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను సంఘ అధ్యక్షుడు బి.కృష్ణమూర్తి, కార్యదర్శి ఎం.బాపిరాజు, ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, కార్యదర్శి జి.ఎలీషాబాబు, ఒలింపిక్ సంఘ ఉపాధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు, ఒలింపిక్ సంఘ సీఓఓ ఎం.మురళీధర్, పీవీ కృష్ణారావు అభినందించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి వీరభద్రారెడ్డి మాట్లాడుతూ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించడం గర్వకారణం అన్నారు. యువ క్రీడాకారులు వీరిని స్ఫూర్తిగా తీసుకుని రాణించాలన్నారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బి.కృష్ణమూర్తి, బాపిరాజులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.