
● ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్స్, మ్యాథ్‌బీ సెమీ ఫైనల్స్
● ఉమ్మడి జిల్లా నుంచి
వెయ్యి మంది విద్యార్థుల హాజరు
● నాలుగు కేటగిరీల్లో పరీక్షల నిర్వహణ
ఎంతో ఉపయుక్తం అంటున్న తల్లిదండ్రులు
రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులను ఆంగ్ల భాషలో పరిజ్ఞానవంతులుగా, గణితంలో ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి’ స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్స్, ‘సాక్షి’ మ్యాథ్‌బీ సెమీ ఫైనల్స్ ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. రాజమహేంద్రవరం త్రిపురనగర్‌లోని ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్ష రాయించేందుకు అమితాసక్తి చూపారు. ‘సాక్షి’ స్పెల్‌బీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగు కేటగిరీలుగా పరీక్షలు నిర్వహించగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ‘సాక్షి’ మ్యాథ్‌బీ నాలుగు కేటగిరీల్లో నిర్వహించారు. మొత్తం వెయ్యి మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. కేటగిరీ–1లో 1, 2 తరగతులు విద్యార్థులకు, కేటగిరీ–2లో 3, 4 తరగతులకు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులకు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ‘సాక్షి’ స్పెల్‌బీ, ‘సాక్షి’ మ్యాథ్‌బీ వంటి పరీక్షలు విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని, వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి, కాంపిటేటివ్ పరీక్షలకు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ స్పెల్‌బీ, మ్యాథ్‌బీ నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ట్రిప్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బాలా త్రిపురసుందరి, ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ (అడ్మిన్) ఎస్.రమేష్‌రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్) కె.ఉమాశంకర్‌లు పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మెయిన్ స్పాన్సర్‌గా డ్యూక్స్‌వేఫీస్, అసోసియేట్ స్పాన్సరర్‌గా రాజమహేంద్రవరం ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి.
ప్రోత్సహించడం అభినందనీయం
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ‘సాక్షి’ స్పెల్‌బీ నిర్వహించడం అభినందనీయం. నార్మల్ స్టడీస్‌తో పాటు నేర్చుకోవడం ఈజీ కాదు. ‘సాక్షి’ యాజమాన్యం స్పెల్‌బీ పరీక్ష రాయించి విద్యార్థులను ప్రోత్సహించడం బాగుంది.
–ఎస్‌వీ సురేష్, ఆదిత్య స్కూల్ (శ్రీనగర్) విద్యార్థి తండ్రి, కాకినాడ
విదేశీ విద్యకు ఎంతో ఉపయోగం
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ‘సాక్షి’ స్పెల్ బీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్త పదాలు నేర్చుకోవడంతో పాటు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంగ్లిషు భాషపై పట్టు సాధించవచ్చు. –ఆరవ్‌కృష్ణ గూడూరు, 9వ తరగతి,
ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం
కొత్త విషయాలు తెలుసుకున్నా..
‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష రాయడంతో నేను సరికొత్త విషయాలను తెలుసుకున్నాను. స్పెల్లింగ్స్‌తో పాటు, ఇంగ్లిషు భాషపై పూర్తి పట్టు సాధించగలిగాను. ఇటువంటి పరీక్షలు ‘సాక్షి’ యాజమాన్యం పెడుతుంటే విద్యార్థులకు సబ్జెక్టుపై మరింత పట్టు పెరుగుతుంది.
–అమృతవర్షిణి, 10వ తరగతి, ఆదిత్య స్కూల్, అమలాపురం
గణితంపై భయం ఉండదు
గణితం అంటే విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ‘సాక్షి’ మ్యాథ్‌బీ దోహదపడింది. ఈ పరీక్షలు పైతరగతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మ్యాథ్‌బీ గణితంపై పట్టు సాధించేందుకు దోహదం చేస్తుంది. –షర్లీ,
నాల్గో తరగతి, ప్రతిభ స్కూల్, రాజమహేంద్రవరం






