
అయినవిల్లిలో ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొన్న భక్తులు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని సన్నిధికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తిక మాసంలో ఆదివారం సెలవు కావడంతో స్వామి దర్శనానికి పలువురు పిల్లాపాపలతో వచ్చారు. ఆలయంలో నిర్వహించే సుదర్శన హోమంలోనూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యాన్నదాన పథకంలో సుమారు 7 వేల మంది స్వామివారి ప్రసాదం స్వీకరించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు ఆయన తగిన చర్యలు చేపట్టారు. అలాగే, భక్తుల తాగునీటి వసతికి కూడా దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
అయినవిల్లి గణపతి దర్శనానికి భక్తుల బారులు
అయినవిల్లి: విఘ్నేశ్వరుని ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ నిర్వహించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి లఘున్యాస అభిషేకాలు, లక్ష్మీ గణపతి హోమంలో అధిక సంఖ్యలో భక్త దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి గరిక పూజ నిర్వహించారు. పంచామృత, ప్రత్యేక అభిషేకాల్లో 146 మంది భక్త దంపతులు, స్వామి వారి ప్రత్యేక దర్శనంలో 1,010 మంది భక్తులు, శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో 38 మంది పాల్గొన్నారు. నూతన వాహనాలకు 29 మంది పూజలు చేయించుకున్నారు. చిన్నారులకు నామకరణాలు, అక్షరాభ్యాలు, తులాభారం వంటి ప్రత్యేక కార్యక్రమాలను 30 మంది నిర్వహించారు. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,56,591 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

అంతర్వేదిలో స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు