రాజోళి: విఘ్నాధిపతి.. తొలిపూజలు స్వీకరించే నాథుడు.. గణపయ్యకు చవితి పూజలను ప్రజలు ఘనంగానే నిర్వహించారు. స్వామి రాకను కాంక్షిస్తూ.. ఊరేగింపుగా అంగరంగ వైభవంగా కొలువుదీర్చారు. శక్తి మేరకు కొలిచిన భక్తజనులకు గణపయ్యను నిమజ్జనం పంపడం పెద్ద సమస్యగా మారింది. గతంలో వినాయక నిమజ్జనం అంటే స్థానికంగా చెరువులు, వాగులు, నదుల్లో పుష్కలంగా నీరు ఉండేది. కానీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడే లేకపోవడంతో చెరువులు, కుంటలు, వాగులు నీటి జాడే లేకపోగా.. జీవనదులు కృష్ణా, తుంగభద్ర సైతం ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. దీంతో గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడం ఎలా అన్న ప్రశ్న నిర్వాహకులను కలవరపెడుతోంది. కాగా.. అధికారులు మాత్రం జిల్లాలోని బీచుపల్లి వద్దే పెద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అడుగంటిన తుంగభద్ర..
జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉండగా.. వీటి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎన్నో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటాయి. అయితే ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు తుంగభద్ర, కృష్ణానదులకే వస్తారు. ఏటా బీచుపల్లి వద్ద వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవని కారణంగా నదిలో నీరు లేకపోవడంతో నిమజ్జనంకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా బేసిన్‌లో కురిసిన అరకొర వర్షాలతో వస్తున్న వరదతో జిల్లా పరిధిలోని కృష్ణానదిలో కొద్ది మేర నీరు ఉండగా.. తుంగభద్ర నదిలో మాత్రం పూర్తిగా ఒట్టిపోయింది. ప్రధానంగా నిమజ్జనం చేసే ప్రదేశాల్లో కూడా వినాయక విగ్రహాలు నీటిలో మునిగే స్థాయిలో కూడా నీరు లేకపోవడం గమనార్హం.
జిల్లాలో నిమజ్జన ప్రదేశాలు..
ఏటా నిమజ్జనం చేసేందుకు జిల్లా అధికారుల నేతృత్వంలో కృష్ణా, తుంగభద్ర నది పరివాహకాల్లో కొన్ని ప్రదేశాలు గుర్తించేవారు. ఈసారి కూడా కృష్ణానది పరివాహకంలో జూరాల డ్యాం, నది అగ్రహారం, బీచుపల్లితోపాటు తుంగభద్ర నది పరివాహకంలో సుంకేసుల డ్యాం, అలంపూర్, గొందిమల్ల, క్యాతూరు పుష్కర ఘాట్లను గుర్తించారు. వీటితోపాటు ఆయా గ్రామాల శివారుల్లో నదుల్లో నీరు ఉన్న చోట కూడా.. స్థానికంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. అందులో తుంగభద్ర నదితీరంలోని పెద్దధన్వాడ, చిన్నధన్వాడ, రాజోళి, తుమ్మిళ్ల, కొర్విపాడు, మద్దూరు తదితర గ్రామాలు ఉండగా ఆ గ్రామాల్లో నది మొత్తం ఒట్టిపోయింది. ఆ గ్రామాల వారు ప్రతిఏటా స్థానికంగానే నదిలో నిమజ్జనం చేసేవారు. ప్రస్తుతం వారికి కూడా నిమజ్జనం ప్రశ్నార్థకంగా మారింది.
రాజోళి వద్ద నీరు లేక ఎండిపోయిన తుంగభద్ర నది
గణపయ్య నిమజ్జనానికి సవాళ్లు
వర్షాభావ పరిస్థితులతో
చెరువుల్లో కానరాని నీటి జాడ
నడిగడ్డలో ఎండుదశకు
చేరుకున్న రెండు జీవనదులు
నెర్రెలు బారి 10 అడుగుల
కనిష్టానికి నీటిమట్టం
అయినప్పటికీ కృష్ణానదికే తరలింపు?


