అలంపూర్: పట్టణంలోని హరిత హోటల్‌కు గురువారం రాత్రి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులతో అలంపూర్ ఆలయాల సందర్శనార్థం వచ్చారు. ఈ మేరకు వారికి అదనపు కలెక్టర్లు నర్శింగ్‌రావ్, మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగలయ్య ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం అలంపూర్ ఆలయాలను చైర్మన్ సందర్శిస్తారని చెప్పారు. కార్యక్రమంలో సీఐ ప్రదీప్, తహసీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
అత్యుత్తమ పనితీరులో రాజోళి పోలీస్‌స్టేషన్
రాజోళి: దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీస్‌స్టేషన్లను గుర్తించేందుకు కేంద్రస్థాయిలో నిర్వహించే వార్షిక సర్వేకు రాజోళి పోలీస్‌స్టేషన్ ఎంపికై నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం నియమించిన సర్వే అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ గురువారం రాజోళి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్ స్టేషన్‌లో రికార్డుల పరిశీలన, కేసుల సత్వర పరిష్కారం, బాధితులకు న్యాయం అందించడంలో పోలీసుల పాత్ర, అమాయక ప్రజలకు స్టేషన్లో అందించే న్యాయ సేవ, వారి పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు గురించి ఆయన వివరాలు సేకరించారు. స్టేషన్‌కు వచ్చిన వారితోపాటు, స్థానికులతో ఆయన మాట్లాడారు. అత్యవసర సమయంలో ఏ విధంగా స్పందిస్తున్నారు.. ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది వ్యవహరించే తీరు గురించి ఆరాతీశారు. కాగా రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబరిచే మూడు పోలీస్‌స్టేషన్లలో జిల్లాలోని రాజోళి స్టేషన్ కూడా ఉండటంతో ఈ సర్వే నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో శాంతిగనర్ సీఐ శంకర్, ఎస్‌ఐ కిరణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లీ @ రూ.7,089
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 194 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,089, కనిష్టంగా రూ.5,270, సరాసరిగా రూ.5,719 ధరలు లభించాయి. అలాగే 13 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్ రూ.7,021 ఒకే ధర పలికింది.
ప్రధాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి
ఎర్రవల్లి: ప్రధానమంత్రి నరేంద్రదాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం జింకలపల్లి కేఆర్‌ఆర్ ఆస్పత్రి వద్ద రాష్ట్ర డాక్టర్ సెల్ కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి ఆధర్యంలో రక్తదానం, ఉచిత వైద్య శిబిరం, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి హాజరై నాయకులతో కలిసి సేవా కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, మౌళిక వసతులు, డిజిటల్ సేవలు, పేదల సంక్షేమం వంటి రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ఉజ్వల యోజన, జల్ జీవన శక్తి వంటి పథకాల ద్వారా ప్రజలకు అనేక సేవలు అందుతున్నాయన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు స్నిగ్ధారెడ్డి, వెంకటరాముడు, రవికుమార్, సంజీవరెడ్డి, బాబురెడ్డి, మమత, మధుగౌడ్, జగదీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


