కౌన్సిలర్‌ భర్తపై మాజీ కౌన్సిలర్‌ దాడి | - | Sakshi
Sakshi News home page

కౌన్సిలర్‌ భర్తపై మాజీ కౌన్సిలర్‌ దాడి

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

ప్రజాపాలన కార్యక్రమంలో

చెలరేగిన వివాదం

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

గద్వాల క్రైం: రెండు పార్టీల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఓ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌.. ప్రస్తు త మహిళ కౌన్సిలర్‌ భర్త చెంపను చెల్లుమన్పించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ ద్వాల మున్సిపాలిటీలోని 36వ వార్డులో శుక్రవారం ఉదయం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా పెన్షన్‌కు అర్హులైన లబ్ధిదారుల బయోమెట్రిక్‌ వివరాలు సేకరణ వార్డు అధికారి సమక్షంలో చేపట్టారు. అయితే ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిల్‌ సభ్యురాలు (బీఆర్‌ఎస్‌ పార్టీ) కమ్మరి సునీతతోపాటు భర్త రాము సైతం హాజరయ్యారు. ఈ క్రమంలో ఇదే వార్డుకు సంబంధించిన మాజీ కౌన్సిలర్‌ నర్సింహులు, అనుచర వర్గం కార్యక్రమ వివరాలు తెలిజేయకుండా ఏర్పాటు చేశారని ఆరోపించగా.. కౌన్సిలర్‌, ఆమె భర్త ప్రతి ఒక్కరికి తెలియజేశామని వివరించారు. దీంతో మాటమాట పెరగడంతో క్షణికావేశంలో మహిళా కౌన్సిలర్‌ భర్త రామును మాజీ కౌన్సిలర్‌ (బీజేపీ) నర్సింహులు ఒక్కసారిగా చెంప చెల్లుమన్పించాడు. దీంతో వాతవరణం గందరగోళంగా మారి.. ఇరువురు దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించడంతో స్థానికులు కట్టడి చేశారు.

రెండు పార్టీల మధ్య వైరం..

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన వ్యక్తులు కావడంతో దాడి ఘటన ఉద్రిక్తతకు దారీ తీసింది. ఇరు కుటుంబాలకు ముందు నుంచి వైరం ఉండటంతో స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో బాధితుడు రామును అప్పటి మహిళా కౌన్సిలర్‌ (రజక నర్సింహులు భార్య) సైతం దాడి చేయడం కొసమెరుపు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రస్తుత మహిళా కౌన్సిల్‌ సభ్యురాలు భర్త జీవించి ఉండగానే వితంతువు పెన్షన్‌ పొందుతుందని ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు సైతం కేసు నమోదైంది. పాత కక్షలు మనస్సులో పెట్టుకుని ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. దాడి ఘటనపై పట్టణ పోలీసు స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement