గద్వాల న్యూటౌన్: ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాలను సవరించి, ప్రతి కార్మికుడి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నర్సింహ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం ప్రకటించిన వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేవన్నారు. కార్మికులు, సంఘాలు చేసిన డిమాండ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. కనీస వేతనాలను కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలుగా విభజించి వేర్వేరుగా ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వేతనాలను అన్‌స్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హైస్కిల్డ్ అని నాలుగు కేటగిరీలుగా విభజించి, అన్ని రంగాల్లో ఒకే రకంగా వేతనం పెంచడం వల్ల కార్మికవర్గం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపులో కరువు భత్యానికి సంబంధించిన అంశాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. కార్మిక సంఘాలు, కనీస వేతనాల మండలి సిఫార్సులను పరిగణలోకి తీసుకోకుండా.. మంత్రివర్గ ఉపసంఘం పేరిట ఏకపక్షంగా కనీస వేతనాలు నిర్ణయించడం అన్యాయం అన్నారు. 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ ఫార్ములా, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. సమావేశంలో నాయకులు నర్సింహులు, గోవిందు, మోష, రాముడు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


