డీసీసీబీలో యూపీఐ సేవలు | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీలో యూపీఐ సేవలు

May 22 2026 12:42 AM | Updated on May 22 2026 12:42 AM

రూ.2,500 కోట్ల

టర్నోవర్‌

ఇకపై గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా సులభంగా లావాదేవీలు

నగదు రహిత చెల్లింపులకు

ముందడుగు

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ (డీసీసీబీ) డిజిటల్‌ బ్యాంకింగ్‌ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1920 సంవత్సరంలో స్థాపించబడిన ఈ బ్యాంక్‌, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22 బ్రాంచ్‌లతో సేవలందిస్తున్న డీసీసీబీ.. తాజాగా తన ఖాతాదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త సేవలతో ఖాతాదారులు గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి ప్రముఖ డిజిటల్‌ యాప్‌ల ద్వారా నేరుగా బ్యాంక్‌ ఖాతాలకు అనుసంధానం చేసుకుని నగదు రహిత లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చు. డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లింపులు చేయడం, చిన్న వ్యాపార లావాదేవీలను తక్షణమే పూర్తి చేయడం వంటి సేవలు ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ ద్వారానే సాధ్యమవుతున్నాయి.

3 లక్షలకుపైగా ఖాతాదారులు

డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ బ్యాంక్‌ సేవలను వినియోగి స్తున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో వీరికి బ్యాంక్‌ శాఖలకు వెళ్లే అవకాశం తగ్గి.. ఇంటి వద్ద నుంచే వేగవంతమైన డిజిటల్‌ సేవలు పొందే అవకాశం ఏర్పడింది.

24 గంటల పాటు..

ఖాతాదారులు తమ మొబైల్‌ నంబర్‌ను బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానం చేసుకుని యూపీఐ యాప్‌లో నమోదు చేసుకుంటే సేవలు వెంటనే యాక్టివేట్‌ అవుతాయి. రోజులో 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీలు పూర్తవుతాయని పేర్కొన్నారు.

చెల్లింపులపై అవగాహన..

సహకార బ్యాంకింగ్‌ వ్యవస్థను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో డీసీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రజల్లో డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.

2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి డీసీసీబీ రూ.2,500 కోట్ల టర్నోవర్‌ను అధిగమించడం బ్యాంక్‌ ప్రగతికి నిదర్శనంగా భావిస్తున్నారు. సహకార రంగంలో విశ్వసనీయ సేవలతోపాటు ఆధునిక సాంకేతిక సేవలను అందిస్తూ డీసీసీబీ ముందుకు సాగుతుండటంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మన బ్యాంక్‌తో స్మార్ట్‌ బ్యాంకింగ్‌ను ఆస్వాదించండి’ అనే నినాదంతో యూపీఐ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని బ్యాంక్‌ యాజమాన్యం ఖాతాదారులను కోరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement