సద్వినియోగం చేసుకోవాలి..
● పదో తరగతి మెరిట్
ఆధారంగా ఎంపిక
● జూన్ 5వ తేదీ వరకు
దరఖాస్తులకు అవకాశం
కందనూలు: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు ఇంటర్ విద్య ఎంతో కీలకం. దీంతో చాలామంది విద్యార్థు లు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ అభ్యసించడానికి పట్టణ, నగర ప్రాంతాలకు వెళ్తుంటా రు. అయితే కార్పొరేట్ విద్య నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారింది. ఈ నేపథ్యంలో సర్కా రు బడుల్లో పదో తరగతి చదివి ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదివేందుకు సహకారం కల్పిస్తోంది. కార్పొరేట్ విద్యా పథకం కింద ఎంపికై న ఒక్కో విద్యార్థికి రూ.35 వేలు, పాకెట్ మనీగా రూ.3వేలు చెల్లిస్తుంది. దీని కోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ పరిగణలోకి తీసుకొని 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ కళాశాలకు ఎంపిక చేయనుంది. దరఖాస్తు గడువు జూన్ 5వ తేది వరకు ఉంది.
ఇవీ అర్హతలు..
జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్, కేజీబీవీలు, నవోదయ, మోడల్ స్కూల్స్, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.50 లక్షలు మించకూడదు. దరఖాస్తుకు మీసేవ కేంద్రాల నుంచి పొందిన కుల, ఆదాయ, ధ్రువపత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువపత్రాలను జతపరచాలి. పదో తరగతిలో 400కిపైగా మార్కులు సాధించిన వారిని ప్రవేశాలకు అధికారులు ఎంపిక చేస్తారు. అలాగే మీసేవ కేంద్రాల ద్వారా టీఎస్ ఈపాస్ పోర్టల్‌లో telanganaepass.cgg.gov.in దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని కార్పొరేట్ విద్యా పథకం ద్వారా పేద విద్యార్థులకు అవకాశం కల్పించింది. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్ కళాశాలనైనా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
– ఉమాపతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి
అధికారి, నాగర్‌కర్నూల్


