● జిల్లా ఆస్పత్రిలో ఊడిపడిన
పైకప్పు పెచ్చులు
● వైద్యులు, రోగులకు
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
గద్వాల క్రైం: జిల్లా ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక వార్త సంచలనంగా మారుతుంది. ఫ్రీజర్లు పనిచేయడం లేదనే సాకుతో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆరుబయటే వేయడంపై రాష్ట్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఈ ఘటన మరవక ముందే మరో ప్రమాదకర సంఘటన చోటుచేసుకోవడం, దీనిని కూడా అధికారులు గోప్యంగా ఉంచడం విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం రోగులకు ఓపీ సేవలు అందించేందుకు 9వ నంబర్ విభాగంలో సర్జికల్ వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ప్రమాద సమయం భోజన విరామం కావడంతో వైద్యులు, రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పై కప్పు పెచ్చులు వైద్యులు కూర్చునే కుర్చీలు, టేబుల్‌పై పడటంతో ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే భారీ శబ్దం రావడంతో సమీపంలో ఉన్న సిబ్బంది, ఓపీ సేవల కోసం వచ్చిన రోగులు బయటకు పరుగులు తీశారు. అయితే పై కప్పు పెచ్చులు ఊడిపడిన విషయాన్ని వైద్య సిబ్బంది గోప్యంగా ఉంచడం గమనార్హం.
– ఈ విషయమై ఆర్‌ఎం హేమలతను ‘సాక్షి’ సంప్రదించగా నాలుగు రోజుల క్రితం పై కప్పు పెచ్చులు ఊడిపడిన విషయం వాస్తవమేనన్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదన్నారు. త్వరలో మరమ్మతు చేపడుతామని వివరించారు. మరోవైపు జిల్లా ఆస్పత్రి నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు లేకుండా చేపట్టినట్లు కొంత మంది సిబ్బంది ఆరోపించారు. జిల్లా ఆస్పత్రిలో వరుస సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో సిబ్బంది, రోగులు భయాందోళన చెందుతున్నారు.


