జడ్చర్ల: శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిల్లలమర్రి మ్యూజియం సహాయ సంచాలకులు నాగలక్ష్మి పేర్కొన్నారు. ఆల్వాన్‌పల్లి గ్రామశివారులో గొల్లత్తగుడి ఆవరణలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గొల్లత్తగుడి వైభవాన్ని ఈ సందర్భంగా అక్కడి వారికి వివరించారు. క్రీ.శ. 7–8వ శతాబ్దానికి సంబంధించి జైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిందన్నారు. జైన దేవాలయ అవశేషాలు, ఇటుకలతో నిర్మాణశైలి, తవ్వకాలలో లభించిన జైన శిల్పాలు చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. వారసత్వ సంపద పరిరక్షణ, పురాతన కట్టడాలను పరిరక్షించకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో వారసత్వ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడం ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలోసర్పంచ్ దాసుయాదవ్ పాల్గొన్నారు.


