భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచండి

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

గద్వాల: జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇందుకు సాగునీటిపారుదల, రెవెన్యూ, భూసేకరణశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియ లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ.. నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు మొదలై 20ఏళ్లు అవుతున్నా ఇంకా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. కొన్ని ప్యాకేజీల్లో భూసేకరణ పెండింగ్‌లో ఉందన్నారు. 99వ ప్యాకేజీ పనులు త్వరగా పూర్తిచేసి.. పూర్తి ఆయకట్టుకు సాగునీటిని అందించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్‌ఈ రహీముద్దీన్‌ ఉన్నారు.

● ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. ఉపాధిహామి పథకం, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎన్‌ఎఫ్‌బీఎస్‌ తదితర అంశాలపై హైదరాబాద్‌ నుంచి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కిషోర్‌, సెర్ప్‌ సీఈఓ దివ్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధిహామీ కూలీలు ఉదయాన్నే తమకు నిర్ధేశించిన పని ప్రదేశాలకు వెళ్లి పనిచేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అంగన్‌వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగు దొడ్లు, మహిళా సంఘాల భవన నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా జల్‌ సంచాయి జన్‌ భగీరథి పురస్కారా లు జిల్లాకు దక్కేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. గ్రామీణ అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వివిధ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి.. రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, డీఆర్డీవో ముషాయిదాబేగం, ఏపీడీ శ్రీనివాస్‌, పీఆర్‌ ఈఈ ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement