గద్వాలన్యూటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే అమలుచేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్‌సీ, డీఏలు ఇస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం.. ఇంతవరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పీఆర్సీ సమయం 2023 జూలై 1తో ముగిసి మూడేళ్లు అవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఆరోపించారు. జనగణన చేపడుతున్న ఎన్యూమరేటర్లు ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారని.. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్లు మాత్రమే కేటాయించాలని కోరారు. అదే విధంగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను క్లియర్ చేయాలన్నారు. జీపీఎఫ్ పార్టు ఫైనల్స్, సరెండర్ లీవ్స్, సీపీఎఫ్ ఉద్యోగుల ఏరియర్స్, టీఎస్ జీఎల్‌ఐ ఫైనల్ పేమెంట్స్ తదితర బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ శాస్త్రి, హరిబాబు, హనుమంతు పాల్గొన్నారు.


