ఎర్రవల్లి: పని కావాలని అడిగే ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని డీఆర్డీఓ ముసాయిదాబేగం అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండలం కొండేరులో ఉపాధిహామీ పనులను ఆమె పరిశీలించి.. పనుల నాణ్యత, మాస్టర్ రోల్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం డీఆర్డీఓ మా ట్లాడుతూ.. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున కూలీలు ఉదయాన్నే పనులకు వచ్చి మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవాలని సూచించారు. అదే విధంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తగి నంత నీరు తాగడం, అలసట అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ప్రతి కూలీ సరైన కొలతల ప్రకారం పని చేస్తేనే ప్రభుత్వం ప్రకటించిన కూలి వస్తుందన్నారు. వేసవి దృష్ట్యా కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీటితో పాటు అవసరమైన అన్ని వసతులను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఉపాధిహామీ పనుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ మహేశ్, టెక్నికల్ అసిస్టెంట్ లావణ్య, పంచాయతీ కార్యదర్శి రాజు, ఎఫ్‌ఏ షాలన్న ఉన్నారు.


