మృతదేహం.. భద్రపర్చలేం! | - | Sakshi
Sakshi News home page

మృతదేహం.. భద్రపర్చలేం!

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

నిర్వహణ గాలికి..

జిల్లా ఆస్పత్రి మార్చురీలో పనిచేయని బాడీ ఫ్రీజర్లు

వారం రోజులుగా గాలికొదిలేసిన వైనం

గుర్తుతెలియని మృతదేహం వస్తే

తప్పని సమస్య

తాజాగా 3 గంటలపాటు

ఆరుబయటే ఓ వృద్ధుడి మృతదేహం

జిల్లాలో హాట్‌టాఫిక్‌గా మారిన ఘటన

గద్వాల క్రైం: గుర్తుతెలియని మృతదేహాల వివరాలను సేకరించేందుకు పోలీసులకు కొంత సమయం పడుతోంది. అప్పటిలోగా మృతదేహాన్ని భద్రపరిచేందుకు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీనే దిక్కు. అలాంటి మార్చురీలో బాడీ ఫ్రీజర్లు వారం రోజులుగా పనిచేయకపోవడం.. గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు తీసుకొస్తే వైద్యసిబ్బంది గంటల తరబడి ఆరుబయటే ఉంచడం జిల్లాలో హాట్‌టాఫిక్‌గా మారింది. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీ శివారులో ఓ గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, రూరల్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచేందుకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడే పోలీసులకు విచిత్రమైన ఇక్కట్లు ఎదురయ్యాయి. మార్చురీలో బాడీ ఫ్రీజర్లు మరమ్మతుకు గురయ్యాయని.. మృతదేహాన్ని భద్రపర్చలేమని పోలీసులతో వైద్యులు చెప్పడం గందరగోళం సృష్టించింది. ఈ క్రమంలోనే 3 గంటల సమయం ముగిసింది. బాడీ దుర్వాసన రావడం మొదలుకావడం.. మీడియా రంగప్రవేశం చేయడంతో ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ ఝాన్సీలక్ష్మి దిద్దుబాటు చర్యలు చేపట్టడం విస్మయానికి గురిచేస్తోంది.

మీరే భద్రపర్చుకోవాలంటూ..

జిల్లా ఆస్పత్రి మార్చురీలో వారం రోజులుగా బాడీ ఫ్రీజర్స్‌ పనిచేయడం లేదని అధికారులకు తెలిసినప్పటికీ.. మరమ్మతు చేయించడాన్ని పట్టించుకోలేదని తాజా ఘటనతో స్పష్టమవుతోంది. అనుకోని ప్రమాదాల ధాటికి ఎవరైనా మరణిస్తే పోలీసులు మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచి.. పూర్తి వివరాల సేకరణ, కేసు నమోదు, పోస్టుమార్టం తర్వాతే కుటుంబీకులకు అప్పగిస్తారు. అయితే తాజా ఘటనలో పోలీసులతో వైద్యసిబ్బంది వ్యవహరించిన తీరు అవమానీయంగా మారింది. మార్చురీలో మృతదేహాన్ని భద్రపర్చాలని వైద్యులను పోలీసులు కోరితే.. ‘‘మార్చురీలో భద్రపర్చలేం.. బాడీ ఫ్రీజర్స్‌ మరమ్మతుకు గురయ్యాయి.. మీరే మృతదేహాన్ని భద్రపర్చండి.. మా చేతుల్లో ఏం లేదు’’ అని సమాధానం రావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. మరోవైపు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ అనుమతి వస్తే తప్ప.. మార్చురీలోకి అనుమతి లేదని నిర్లక్ష్యధోరణితో సమాధానం చెప్పడం గమనార్హం.

జిల్లా ఆస్పత్రి నిర్వహణను అధికారులు గాలికొదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు మార్చురీ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. రోగులకు మెరుగైన సేవలు అందించడంలో సిబ్బంది అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై ఇటీవల కలెక్టర్‌ రిజ్వాన్‌ షేక్‌ బాషా సైతం చురకలు అంటించారు. అయినప్పటికీ సిబ్బందిలో మార్పు రావడం లేదు. కొందరు సమయపాలన పాటించకపోవడంతో పాటు ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఆస్పత్రికి మెడికల్‌ కళాశాల అనుబంధంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న ప్రమాదానికి గురై ఆస్పత్రికి వస్తే రెఫర్‌ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికై నా జిల్లా ఆస్పత్రి నిర్వహణపై పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement