సజావుగా మొక్కజొన్న కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

సజావుగా మొక్కజొన్న కొనుగోళ్లు

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

జిల్లాలో ఇప్పటివరకు

70శాతం ధాన్యం సేకరణ

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహిస్తూ.. కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో 70శాతం కొనుగోలు పూర్తయిందని, మిగిలిన మక్కల సేకరణను రానున్న మూడు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశంలో ఉంచిన మొక్కజొన్నను ముందుగా తూకం వేయాలని సిబ్బందికి సూచించారు. లారీల కొరతను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ గోదాములు సరిపోనందున ప్రైవేటు గోదాముల్లోనూ మొక్కజొన్న ధాన్యం నిల్వ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, మార్కెటింగ్‌ అధికారి పుష్పమ్మ, మార్కెఫెడ్‌ డీఎం చంద్రమౌళి, డీఏఓ వీరప్ప, డీపీఓ శ్రీకాంత్‌, సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌ విమల ఉన్నారు.

యువత నైపుణ్యాలను పెంచుకోవాలి..

యువత అన్ని రంగాల్లో రాణించేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏటీసీలో విద్యార్థులకు కెరీర్‌, స్కిల్‌ డెవ్‌లప్‌మెంట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఏటీసీలో అత్యాధునిక పరికరాలతో వివిధ కోర్సుల్లో అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఇన్నోవేటివ్‌గా ఆలోచించేందుకు సహకరిస్తాయన్నారు. యువత పీఎం ఈజీపీ, ముద్ర, విశ్వకర్మ వంటి అనేక పథకాలను వినియోగించుకొని బ్యాంకుల ద్వారా రుణాలను పొందవచ్చన్నారు. యువత కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించుకుంటే స్టేజ్‌ ఫియర్‌ ఉండదన్నారు. ఇంటర్వ్యూలలోనూ ధైర్యంగా మాట్లాడవచ్చన్నారు. సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు రావాలని ఖాళీగా ఉండకుండా.. ఎక్కడికెళ్లినా ఆయా రంగాల్లో రాణించేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు. క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధితో తమ కెరీర్‌ను గొప్పగా మలచుకోవాలన్నారు. అనంతరం అలంపూర్‌లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన బోచర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అదే విధంగా ఏటీసీలోని యంత్ర పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీవైఎస్‌ఓ రామలింగేశ్వర్‌గౌడ్‌, పర్యాటకశాఖ ఏడీ నాగలక్ష్మి, జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి చరణ్‌దీప్‌, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement