విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తతే శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తతే శ్రీరామరక్ష

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

అలంపూర్‌: ప్రకృతి విపత్తులు, విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తతే శ్రీరామరక్ష అని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ మధుమోహన్‌ అన్నారు. కేంద్ర పర్యావరణ, విపత్తుల నిర్వహణ సంస్థ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ సహకారంతో సోమవారం అలంపూర్‌లో రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ఆధ్వర్యంలో వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రథమ చికిత్స కేంద్రం, అత్యవసర సహాయక కేంద్రాల నమూనాలను అదనపు కలెక్టర్‌ పరిశీలించారు. మున్సిపాలిటీలోని కట్టలపేట కాలనీలో గాయపడిన బాధితులను అంబులెన్స్‌ ద్వారా చికిత్స కేంద్రాలకు ఎలా తరలించాలో మాక్‌ డ్రిల్‌ ద్వారా ప్రదర్శించారు. తుంగభద్రనది పుష్కర ఘాట్‌ వద్ద ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీస్‌, వైద్యశాఖల సిబ్బంది వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో రక్షించే విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. రెస్క్యూ చర్యలు చేపట్టిన అనంతరం బాధితులను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించడం.. వైద్యం అందించడాన్ని ప్రదర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం తదితర అంశాలను ప్రజలకు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. వరదలు, విపత్కర సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తద్వారా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జయరాముడు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి అశోక్‌, తహసీల్దార్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం..

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అధికారులను అదేశించారు. అలంపూర్‌ చౌరస్తా మార్కెట్‌యార్డులోని మొక్క జొన్న కొనుగోలు కేంద్రంతో పాటు గోదాంలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్‌కు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement