● బాధితులకు త్వరగా పరిహారం
అందేలా చూడాలి
● నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి
గద్వాల: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి.. బాధితులకు అన్నివిధాలా అండగా నిలువాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులకు సంబంధించి 2024 సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు 239 అట్రాసిటీ కేసులు నమోదు కాగా.. 51 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వివిధ రకాల కారణాలతో కేసులను పరిష్కరించకపోవడం.. బాధితులకు పరిహారాన్ని అందజేయడంలో జాప్యం చేయడం సరైంది కాదన్నారు. ఈ కేసులకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చొరవతో పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం కమిటీ చైర్మన్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అట్రాసిటీ కేసుల బాధితులకు రూ. 50.25లక్షల పరిహారం అందించినట్లు వివరించారు. బడ్జెట్ మంజూరైనప్పటికీ వివిధ కారణాలతో బాధితులకు రూ. 40లక్షల పరిహారం పెండింగ్‌లో ఉందన్నారు. కమిటీ సభ్యుల సహకారంతో అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి.. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీఎస్పీ మొగులయ్య, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నుషిత, కమిటీ సభ్యులు కుర్మన్న, నర్సింహ, సురేశ్, మల్లిఖార్జున్, శైలజ ఉన్నారు.


