జడ్చర్ల టౌన్: భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుడి కుటుంబానికి చెల్లించే ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలకు పెంచాలని బీసీ జాగృతి సేన కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం మండల విద్యా వనరుల కేంద్రం వద్ద నిర్వహించిన బీసీ జాగృతి సేన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గాయపడిన కార్మికులకు పూర్తిగా నయం అయ్యే వరకు ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలని, కార్మికుని కూతురు పెళ్లి, కాన్పు కోసం చెల్లించే రూ.30 వేలకు బదులుగా పెళ్లికి రూ.లక్ష, కాన్పు ఖర్చు రూ.50 వేలకు పెంచాలన్నారు. ప్రతి పండగకు గుర్తింపు కార్డు కలిగిన కార్మికునికి రూ.2 వేలు నజరానా అందించాలన్నారు. పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల కాంట్రాక్టులను స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని కోరారు. పై అంశాలపై త్వరలోనే స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తామన్నారు. సమావేశంలో బీసీజాగృతి సేన రాష్ట్ర కార్యదర్శి రఘునందనచారి, నాయకులు నర్సింహులు, వెంకటేశ్, శేఖర్, మురళి, నాగేష్, శ్రీశైలం, ఫకీర్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.


