పెద్ద మొత్తంలో వసూలు..
అవినీతిలో బేరసారాలు?
●
గద్వాల క్రైం: జిల్లా రవాణాశాఖలో ఏ పని కావాలన్నా ఓ ఏజెంట్ (దళారీ) సహాయం తప్పనిసరి. వారి ద్వారానే పనులన్నీ ఠక్కున పూర్తవుతాయి. అవసరమైతే నకిలీ పత్రాలతోనూ కానిచేస్తారు. గతంలో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలతో వాహనాల రిజిస్ట్రేషన్లు సైతం జరిగాయి. తాజాగా వాహనం కొనుగోలు చేయని ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరో ఘనతను సొంతం చేసుకున్నారు. జిల్లా రవాణాశాఖ కార్యాలయ సిబ్బంది చేతివాటం ధాటికి ఏజెంట్లు సైతం తమ దందాను పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నారు. సదరు కార్యాలయం చుట్టూ దాదాపు 100 మంది ఏజెంట్లు తిష్ట వేశారు. నిత్యం వివిధ వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్, వాహన బదలాయింపు, పర్మిట్లు తదితర 59కి పైగా సేవల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఆయా సేవలు పొందేందుకు వచ్చే వారితో ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారు. ఎవరైనా వాహనదారుడు ఏజెంట్ లేకుండా వెళ్లినప్పుడు అధికారులకు రూల్స్ అన్నీ గుర్తుకొస్తాయి. కార్యాలయ సిబ్బంది సవాలక్ష ప్రశ్నలు సందిస్తూ.. ఏజెంట్ ద్వారానే పనులు చేసుకునేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా మరో బాగోతం..
కేటీదొడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి గతేడాది మార్చి 31న జిల్లా కేంద్రంలోని హీరో హోండా షోరూంలో బైక్ కొనుగోలు కోసం వెళ్లాడు. ఆ సమయంలో బైక్ ధర రూ. 85వేలుగా చెప్పడంతో కొంత చెల్లించి, అవసరమైన ధ్రువపత్రాలు అందించాడు. తీరా రిజిస్ట్రేషన్ సమయంలో వాహనం ఖరీదు రూ.1.8 లక్షలుగా పేర్కొనడంతో సదరు వ్యక్తి నిరాకరించాడు. తాను చెల్లించిన డబ్బులు ఇవ్వాల్సిందిగా షోరూం నిర్వాహకులకు తేల్చిచెప్పాడు. షోరూం నిర్వాహకులు మాత్రం డబ్బులు ఇవ్వకుండా పంపించేశారు. ఆ తర్వాత అతడి డాక్యుమెంట్లతో మరొకరి పేరుతో ఆ బైక్ రిజిస్ట్రేషన్ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన సదరు వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టగా.. ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో పనిచేసే ముగ్గురికి మెమోలు జారీ చేశారు.
చర్యలు శూన్యం..
ప్రైవేటు బస్సులు, కార్లు, లారీలు, ఇతర గూడ్స్ వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల సమయంలో ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే 2023 ఏప్రిల్‌లో ఆర్టీఏ ఏజెంట్లు కొందరు నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలతో పలు వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించారు. అయితే ఓ వాహనాదారుడు ఇన్సూరెన్స్ కై ్లమ్ చేయించుకునేందుకు వెళ్లిన సమయంలో సదరు కంపెనీ నిర్వాహకులు నకిలీదిగా స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఉండవెల్లి పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా కేంద్రానికి చెందిన 16 మంది ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అయితే రవాణాశాఖ అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సిబ్బందిపై దురుసు ప్రవర్తన..
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో గతేడాది సెప్టెంబర్ 20న ఓ గూడ్స్ వాహనం ఫిట్‌నెస్ పరీక్షల కోసం ఏజెంట్ సహాయంతో కార్యాలయానికి వచ్చింది. ఈ క్రమంలో తనిఖీ చేయాల్సిన అధికారి జాప్యం చేయడంతో సదరు ఏజెంట్ వాగ్వాదానికి దిగాడు. రెండు రోజుల తర్వాత మరో ఏజెంట్, అధికారి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఏజెంట్లు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తూ తమ పనులు చేయించుకుంటున్నారని స్పష్టమవుతోంది.
ఆర్టీఓ కార్యాలయంలో దళారీ వ్యవస్థ
నిబంధనల మేరకు వాహనదారులు ప్రభుత్వ ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే బైక్ డ్రైవింగ్ కోసం ఏజెంట్‌ను ఆశ్రయిస్తే రూ. 2,500, కారు లైసెన్స్ కోసం రూ. 5,400 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌లో మరో విధమైన మోసం చేస్తున్నారు. కమర్షియల్ బోర్డు నుంచి నాన్ అగ్రికల్చర్ (వైట్ బోర్డు)కు మార్చేందుకు అధికారులు వివిధ సాకులు చెబుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. లారీలు, బస్సులు ఫిటెనెస్ పరీక్షల కోసం వెళ్తే తనిఖీలు చేయాల్సిన అధికారులు రూ. 2వేల నుంచి రూ. 4వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాహనాన్ని మరొకరి పేరుపై బదలాయించేందుకు కూడా అధికంగా చెల్లించాల్సిందేనని వాహనదారులు వాపోతున్నారు.
గతంలో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలతో రిజిస్ట్రేషన్లు
తాజాగా ఇతర వ్యక్తి ఫొటోతో వాహన రిజిస్ట్రేషన్
లైసెన్స్ మొదలుకొని తనిఖీల వరకు వసూలు
అవినీతికి అడ్డాగా జిల్లా రవాణాశాఖ కార్యాలయం
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్ లేదా ఫిట్‌నెస్ తనిఖీ చేసిన అధికారికి ఓ రేటు.. ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే అధికారికి మరో రేటు, ఫొటో దించే అధికారికి ఓ రేటు, డాక్యుమెంట్లు పునఃపరిశీలించిన అధికారికి ఓ రేటు ఇలా వివిధ స్థాయిలో ముట్టజెప్పాల్సిందే. వాస్తవంగా కార్యాలయం వెలుపలికి వాహనాదారులు, వివిధ సేవలు పొందే వారు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. కానీ కార్యాలయం మొత్తం ఏజెంట్లతో ఉండటం గమనార్హం.


