భద్రత ప్రశ్నార్థకం..
జిల్లాలోని చాలా సబ్‌స్టేషన్లలో అసలు ఉద్యోగులకు బదులు బినామీలు పనిచేస్తున్నారు. అయితే విద్యుత్ సబ్‌స్టేషన్లలో అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వడ్డేపల్లి సబ్‌స్టేషన్ షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. ఆ తర్వాత కూడా చాలా వరకు విద్యుత్ సమస్యలు తలెత్తాయి. వాస్తవంగా రిస్క్ తీసుకుని పనిచేసే వారిని ఆపరేటర్లుగా నియమించాల్సిన అధికారులు.. జీతం తప్ప తమకేం సంబంధం లేదనే ఏపీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులను నియమించడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి.. బినామీల తతంగంపై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఆపరేటర్లుగా ఏపీ రిటైర్డ్ ఉద్యోగులు
రాజోళి: నిత్యం ఎంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాల్సిన విద్యుత్ సబ్‌స్టేషన్లలో బినామీల జోరు సాగుతోంది. సబ్‌స్టేషన్లలో ఆపరేటర్లుగా నియమించిన స్థానికేతరులు తమ బినామీలతో పనులు చేయిస్తున్నా.. అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని రాజోళి మండలం పచ్చర్ల, వడ్డేపల్లి మండలం జూలకల్, మానవపాడు మండలం కలుకుంట్ల, అయిజ మండలం మేడికొండ, ఉప్పల తదితర ప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం కొత్తగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. సబ్‌స్టేషన్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నారు. వారు మాత్రం తమ స్థానాల్లో ఇతరులతో పనులు చేయిస్తూ.. వచ్చే జీతంలో కొంత మొత్తం వారికి చెల్లిస్తున్నారు. వారు మాత్రం ఇంట్లోనే ఉంటూ హాజరు వేసుకుంటున్నారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీకి చెందిన వారే అధికం..
కొత్త సబ్‌స్టేషన్లల్లో పనిచేస్తున్న ఆపరేటర్లలో అత్యధికంగా ఏపీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు. వారు విధులకు హాజరైన దాఖలాలు లేవు. ఆపరేటింగ్ తెలిసిన వారిని డ్యూటీలో ఉంచి.. వారు మాత్రం తమ పనులు, వ్యాపారాలను కర్నూలులో చక్కగా చూసుకుంటున్నారు. సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న వారికి కనీసం సగం జీతం కూడా ఇవ్వకుండా తమ కష్టాన్ని దోచుకుంటున్నారని పలువురు ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
నేను జిల్లాకు రాకముందే కొన్ని సబ్‌స్టేషన్లు ప్రారంభమయ్యాయి. నేను వచ్చాక కొందరిని విధుల్లోకి తీసుకున్నాం. అయితే సబ్‌స్టేషన్లలో పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. అందుకే ఏపీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులను తీసుకున్నాం. వారి స్థానంలో బినామీలతో పనులు చేయిస్తున్నట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ
విధులకు హాజరు కాకుండా బినామీలతో పనులు
అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం
సబ్‌స్టేషన్ల భద్రతపై నీలినీడలు


