అయిజ: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్‌ఓ స్వామికుమార్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని టీ స్టాళ్లు, హోటళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేయడంతో పాటు సిలిండర్లను సీజ్ చేశారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని.. నిబంధనల మేరకు బుక్ చేసుకున్న వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వంటగ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు.
డిజిటల్ క్రాప్ సర్వే
త్వరగా పూర్తిచేయాలి
అలంపూర్ రూరల్: యాసంగిలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు గాను చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేను త్వరగా పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నారు. బుధవారం మండలంలోని గొందిమల్లలో వ్యవసాయశాఖ సిబ్బంది నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను ఆయన పరిశీలించి.. పలు సూచనలు చేశారు. వలంటీర్లు క్షేత్రస్థాయిలో పంటలను సందర్శించి.. పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే ఆధారంగానే యాసంగి ధాన్యం సేకరణ కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఏఓ ఏఓ నాగార్జున్‌రెడ్డి, ఏఈఓ శిరీష ఉన్నారు.
డీలర్ల నియామకానికి నోటిఫికేషన్
అలంపూర్: జిల్లాలోని చౌకధరల దుకాణ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలంపూర్ (2602009), క్యాతూర్ (2601021), ఉండవెల్లి మండలం బొంకూరు (2611010), మానవపాడు మండలం చండూరు (2609014), నారాయణాపూర్ (2609015), అయిజ మండలం జడదొడ్డి (2605030), కూటకనూరు (2605038), అయిజ (2605046), రాజోళి మండలం పడమటిగార్లపాడు (2610001), పచ్చర్ల (2610020), వడ్డేపల్లి మండలం పైపాడు (2612006), ఎరవ్రల్లి మండలం వల్లూరు (2613001), రాజశ్రీ గార్లపాడు (2613006), ఇటిక్యాల మండలం మొగిలిరావులచెరువు గ్రామాల్లో ఎఫ్‌పీఎస్ డీలర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, అర్హత, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం స్థానికులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరా రు. పూర్తి వివరాలకు తహసీల్దార్ కార్యాలయా ల్లో సంప్రదించాలని ఆయన సూచించారు.
ప్రజలకు మెరుగైన
వైద్యం అందించాలి
ఇటిక్యాల: అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీంద్ర నాయక్ అన్నారు. బుధవారం ఇటిక్యాల పీహెచ్‌సీలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌పీలో ఓపీ, ప్రసవాల సంఖ్య పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కార్యక్రమాలను గ్రామాల్లో వందశాతం పూర్తిచేయాలన్నారు. జాతీయ ఆరోగ్య పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. రోగులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందించాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించి.. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. డీఎంహెచ్‌ఓ సంధ్యాకిరణ్మయి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సిద్ధప్ప, మండల వైద్యాధికారి డా.రాధిక, ప్రోగ్రాం అధికారులు రాజు, అజ్గర్‌అలీ ఉన్నారు.


