ప్రభుత్వ పథకాలను వివరించాలి
● లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా చర్యలు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
అలంపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం అలంపూర్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి.. లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవాలని.. లబ్ధిదారులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డు గది, ఇతర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. తమకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను ఇప్పించాలని మున్సిపల్ కార్మికులు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. అదే విధంగా పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఫార్మసీ, ఎక్స్‌రే, డయాలసిస్ యూనిట్, ఇతర విభాగాలను పరిశీలించి.. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఓపీ సంఖ్య పెంచాలని వైద్యులకు సూచించారు. సబ్ సెంటర్స్ నుంచి రోగులను రెఫర్ చేయాల్సి వస్తే ప్రభుత్వ ఆస్పత్రులకే పంపించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఆస్పత్రిలో అనవసరమైన ఫర్నిచర్ తొలగించాలని సూచించారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను కలెక్టర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు ప్రసాదం అందజేసి, శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారిణి విమల, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ శంకర్ తదితరులు ఉన్నారు.
గద్వాల: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామ, వార్డుసభల్లో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం గ్రామ, వార్డు సభలను ఉదయం 9గంటలకే ప్రారంభించాలన్నారు. సభలకు వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభలో లైన్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. ఇప్పటికే అమలుచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలతో పాటు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ఆయా పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని తెలిపారు. బాల్యవివాహాలు వంటి సామాజిక సమస్యలపై కూడా చర్చించాలన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలను తెలియజేస్తే, వాటిని నోట్ చేసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. దాతల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ కార్మికులు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, పరిశుభ్రత వంటివి చేపట్టాలన్నారు. జనగణనకు సంబంధించి ప్రభుత్వ విధి విధానాల ప్రకారం ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీపీఓ శ్రీకాంత్ ఉన్నారు.


