చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
● బ్యాంకుల ద్వారా రుణాలు
అందించేందుకు చర్యలు
● నేత చీరలను నేరుగా
మార్కెటింగ్ చేసుకోవాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
గట్టు: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం గట్టు మండలం ఆరగిద్దలోని చేనేత కార్మికుల ఇళ్లకు ఆయన స్వయంగా వెళ్లి మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత చీరల తయారీకి కావాల్సిన ముడి సరుకు, యంత్రాలు, డిజైనింగ్ తదితర వివరాలను కార్మికులతో తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గద్వాల చేనేత జరీ చీరలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయన్నారు. ఆరగిద్ద చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నేసిన చీరలను నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని కార్మికులకు సూచించారు. కాగా, సంస్థ కార్మికులు ఆర్థికంగా ఎదగడానికి వర్కింగ్ క్యాపిటల్ కింద రూ. 98 లక్షల రుణాలు ఇప్పించాలని సంఘం అధ్యక్షుడు నర్సప్ప కోరారు. స్పందించిన కలెక్టర్.. ఎల్డీఎం శ్రీనివాసరావుతో మాట్లాడి బ్యాంకు రుణాలు మంజూరు చేయిస్తామని తెలిపారు. అనంతరం ఆరగిద్దలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. కాగా, ఇళ్లపై హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లింగాపురంలో పశుసంవర్ధకశాఖ, భవి ష్య భారత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో చేనేత, జౌళీశాఖ డీఓ సుధారాణి, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి శివానందస్వా మి, సర్పంచులు బాలకృష్ణ, శకుంతల మ్మ, ఎంపీడీఓ చెన్నయ్య పాల్గొన్నారు.
గద్వాల: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ పరిశీలించారు. మొదటగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును సందర్శించి.. కుడి, ఎడమ ప్రధాన కాల్వలను పరిశీలించి, వివరాలను తెలుసుకున్నారు. అనంతరం హైడల్ పవర్ ప్రాజెక్టు ను పరిశీలించి.. విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై ఆరా తీశారు. అదే విధంగా నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టులోని గూడెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను సందర్శించారు. రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన రైతుల వివరాలు, గ్రామస్తులకు కల్పించిన సౌకర్యాలను తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎస్‌ఈ రహీముద్దీన్, ఈఈలు జుబేర్ అహ్మద్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


