నీతి ఆయోగ్‌ సెమినార్‌కు గట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

నీతి ఆయోగ్‌ సెమినార్‌కు గట్టు ఎంపిక

Mar 8 2026 7:36 AM | Updated on Mar 8 2026 7:36 AM

గద్వాల: నీతి ఆయోగ్‌ నిర్వహించనున్న ప్రాంతీయ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ సెమినార్‌కు జిల్లా నుంచి గట్టు బ్లాక్‌గా ఎంపిక కావడం గర్వకారణమని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నీతి ఆయోగ్‌ యాస్పిరేషనల్‌ బ్లాక్స్‌ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఎంపికై న వివిధ జిల్లాల్లో నిర్దేశిత అంశాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను గుర్తించి ఇతర ప్రాంతాల ప్రతినిధులతో వాటిని పంచుకునేందుకు సోమవారం విశాఖపట్నంలో నీతి ఆయోగ్‌ సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం–3 పరిధిలో మొత్తం ఆరు రాష్ట్రాలు పాల్గొంటున్నాయని, ఇందులో తెలంగాణ నుంచి గద్వాల, నిర్మల్‌ జిల్లాలు మాత్రమే ఎంపిక కావడం విశేషమన్నారు. ఇతర జిల్లాల నుంచి అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ గట్టు బ్లాక్‌లో విద్యారంగంలో అమలుచేస్తున్న కార్యక్రమాల గురించి సెమినార్‌లో తెలియజేసేందుకు గట్టు బ్లాక్‌ ఎంపిక కావడం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగే ఈ సెమినార్‌లో గట్టు బ్లాక్‌లో విద్యారంగం సాధించిన ప్రగతిపై ఇతర రాష్ట్రాలతో పంచుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. సెమినార్‌లో తాను ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గట్టు మండలం గతంలో విద్యారంగంలో తక్కువ అక్షరాస్యత, విద్యార్థుల డ్రాప్‌ అవుట్స్‌, పాఠశాలల్లో టీచర్ల కొరత, తక్కువ ఫలితాలు వంటి సమస్యలు ఉండేవన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు యాస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాంలో భాగంగా విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టినట్లు వివరించారు. గత రెండేళ్లుగా విద్యా వలంటీర్ల నియామకం, సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు, మోడల్‌ పరీక్షల నిర్వహణ తదితర కార్యక్రమాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. గట్టు, కేటీదొడ్డి మండలాల్లో బాలకార్మిక వ్యవస్థ నిరోధక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 9–12వ తరగతి విద్యార్థుల కోసం కెరీర్‌ గైడెన్స్‌, ప్రేరణాత్మక కార్యక్రమాలు, డ్రాప్‌అవుట్‌ విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడం మండల స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. భవిష్య భారత్‌, టీచ్‌ఫర్‌ చేంజ్‌, ఎంవీ ఫౌండేషన్‌ తదితర స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఉదయం పోషకాహార కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా విద్యార్థులలో చదువుపై ఆసక్తి పెరిగి డ్రాప్‌అవుట్స్‌ తగ్గిపోయాయన్నారు. అంతేకాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో వారు పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. పదో తరగతి ఫలితాలు గణనీయంగా మెరుగైనట్లు వివరించారు. దీనికి విద్యాశాఖ, విద్యార్థుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధుల కృషి కారణమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement