అంతుచిక్కని ఓటరు నాడీ
● ఏరులై పారిన లిక్కర్,
విచ్చలవిడిగా నగదు పంపిణీ
● స్పష్టత లేని పోలింగ్ సరళి
● మల్లగుళ్లాలు పడుతున్న ప్రధాన పార్టీలు
గద్వాల: మున్సిపాలిటీలోని 37 వార్డుల్లో జరిగిన ఎన్నికలు గతానికి భిన్నంగా జరిగాయి. ఈసారి అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు మూడు కూడా తమకు పట్టున్న వార్డుల్లో నువ్వానేనా అన్న తరహాలో పోటీపడ్డాయి. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఓటర్లను ఆకర్షించుకునేందుకు వివిధ రకాల తాయిళాలు ఇచ్చారు. చికెన్, మిఠాయి డబ్బాలు, చీరలతో పాటు ఓటుకు గరిష్టంగా కొన్ని వార్డుల్లో రూ.5వేల వరకు, కనిష్టంగా రూ.వెయ్యి వరకు నగదు పంపిణీ చేశారు. అదే విధంగా యువత, కమ్యూనిటీ సభ్యులు, వృద్ధుల సంఘం ఇలా అన్ని గ్రూపులను లక్ష్యంగా చేసుకుని లిక్కర్‌ను ఏరులై పారించారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు కలుపుకొని రూ.15 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు అనాధికారిక అంచనా.
పెద్ద ఎత్తున తాయిళాలు పంచినా ఓటరు నాడీ గుర్తించడంలో పార్టీలన్నీ గందరగోళంలో పడ్డాయి. బాహాటంగా ఎవరికి వారు తమకు ఇన్ని సీట్లు వస్తాయి అని దబాయించి చెబుతున్నప్పట్టికీ మనసులో మాత్రం ఎక్కడో అనుమానం నెలకొంది. కొంత మంది నాయకులైతే అరే ఇంత పెద్ద మొత్తంలో నగదు, లిక్కర్, స్వీట్లు, చికెన్ పంచి పెట్టినా ఎవరికి ఓటు వేశారో తెలియడం లేదు.. ఎంతైనా పట్టణ ఓటర్లు.. పట్టణ ఓటర్లే అంటూ నిట్టూర్పుతున్నారు. మరి కొంత మంది నాయకులు టెన్షన్ తట్టుకోవాంటే మందు డోస్ పెంచాల్సిందే అంటూ మత్తులో జారుకుంటున్నారు. వీరి ఉత్కంఠకు తెరదించాలంటే ఈ నెల 13వ తేదీ కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.


