మూడు ముక్కలాట..
రసకందాయంలో గద్వాలలో పుర పోరు
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరాహోరు
● చేరికలతో బలం పెంచుకునేలా ప్రధాన పార్టీల ఎత్తుగడలు
● జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ
● ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే బండ్ల ప్రచారం
● ఒకవైపు చేరికలు.. మరోవైపు ప్రచారంలో బీఆర్‌ఎస్ నాయకులు
గద్వాల: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలలో రాజకీయం ఒక తీరుగా ఉంటే.. జిల్లాకేంద్రమైన గద్వాలలో మాత్రం పూర్తిభిన్నంగా ఉంది. అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ రెబెల్ వర్గం పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటే.. గద్వాలలో మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటూనే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో బీఫాంల పంచాయతీ కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా ఇక మిగిలింది బీఫాంల సమర్పణ, బరిలో ఎవరు ఉండబోతున్నారో తేల్చే అభ్యర్థుల తుది జాబితానే రావాల్సి ఉంది.
బీఫాంల పంచాయితీ..
ఇదిలా ఉంటే గద్వాల కాంగ్రెస్ పార్టీలో బీఫాంల పంచాయితీ కొనసాగుతుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తన వర్గానికి కాంగ్రెస్ పార్టీ బీఫాంలను ఇప్పించుకోవడంలో సఫలీకృతమయ్యారు. అయితే పార్టీలో ఇన్‌చార్జిగా కొనసాగుతున్న తనకు కాకుండా ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఎలా బీఫాంలు ఇస్తారని సరిత అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టింది. గద్వాలలో 37 వార్డులకు కాకుండా సగం వార్డులకై నా తనవర్గానికి ఇవ్వాలని కోరారు. అయితే మరోవైపు ఒక్క బీఫాం తక్కువగా ఇచ్చినా ఒప్పుకొనేది లేదని ఎమ్మెల్యే బండ్ల పట్టుబట్టడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పి వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే సంపత్‌కుమార్ సైతం ఎమ్మెల్యే బండ్ల, సరిత వర్గాలతో మంతనాలు జరిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సైతం ఇరువర్గాలతో నేరుగా మాట్లాడినట్లు సమాచారం. వర్గపోరుతో పార్టీకి నష్టం జరగకుండా చూడాలని, అదే క్రమంలో పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. దీంతో సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ శంకర్‌కు బీఫాం ఇవ్వడానికి ఎమ్మెల్యే బండ్ల సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అభివృద్ధి మంత్రంతో ఎన్నికల్లో ఓటర్లను కలుస్తూ మరోవైపు పార్టీలో వర్గపోరు, రెబెల్స్ తాకిడి వంటి సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తనవర్గాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అనే చర్చ పట్టణంలో మొదలైంది.


