నిబంధనల మేరకే గుర్తుల కేటాయింపు
గద్వాల: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల మేరకే గుర్తులు కేటాయించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు బ్యాలెట్ పేపర్స్ ముద్రణపై కలిగి ఉండాలన్నారు. నామినేషన్ల విత్‌డ్రా అనంతరం వివిధ రాజకీయ పార్టీల తరపున, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ఆయా గుర్తులను కేటాయించాలన్నారు. వార్డుల వారిగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలతో కూడిన బ్యాలెట్ పేపర్ ముద్రణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫైనల్ ప్రూఫ్ రీడింగ్ అనంతరం రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్స్ ముద్రణ చేయించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారందరికీ పోస్టల్ బ్యాలెట్స్ అవకాశం కల్పించడం జరుగుతుందని, నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులందరూ హ్యాండ్‌బుక్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులోని నిబంధనల మేరకు విధులను పకడ్బందీగా నిర్వ ర్తించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, జెడ్పీ డీప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఎన్నికల నోడల్ అధికారులు శ్రీనివాసరావు, రమేష్‌బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


