దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నుషిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు మార్చి 31వ తేదీ వరకు www.epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నామినేషన్ల ప్రక్రియలో అవకతవకలు
గద్వాల టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అనుమానం ఉందని కాంగ్రెస్ నాయకుడు తిరుపతయ్య ఆరోపించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి 7.30 గంటలకు తిరుపతయ్య తన వర్గంలోని అభ్యర్థులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ జానకిరాం దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపులలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ల దాఖలు చేశారు. నామినేషన్ల చివరిరోజు జనవరి 30వ తేదీ నాటికి కాంగ్రెస్ పార్టీ నుంచి 119 నామినేషన్లు దాఖలు అయ్యాయని అదనపు కలెక్టర్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 42 నామినేషన్లు దాఖలు అయ్యాయని అడిషినల్ కలెక్టర్ మరో ప్రకటన అధికారింగా విడుదల చేశారు. ఒక్క రోజు తేడాలో నామినేషన్లు ఎలా తగ్గాయని తిరుపతయ్య కమిషనర్‌ను ప్రశ్నించారు. ఏ అభ్యర్థి కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోయినా 119 నుంచి 42కు ఎలా తగ్గాయని వాదనకు దిగారు. పరిస్థితి విషమిస్తుందనే సమాచారం మేరకు వెంటనే డీఎస్సీ మొగిలయ్య, సీఐ శ్రీనివాస్, నలుగురు ఎస్‌ఐలు, 20 మంది పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కమిషనర్ చాంబర్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులను బయటికి పంపించి, ముగ్గురు ముఖ్యమైన నాయకులు మాట్లాడేలా చర్యలు తీసుకున్నారు. నామినేషన్ల వివరాలను మున్సిపాలిటీ నుంచి ఇవ్వలేదని కమిషనర్ జానకిరాం వారికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 88 నామినేషన్లు దాఖలయ్యాయని, అవే వివరాలను కలెక్టరేట్‌కు పంపామని చెబుతూ ఆ కాపీని కమిషనర్ కాంగ్రెస్ నాయకులు అందజేశారు. అయితే ఈ జాబితాలో కూడా తప్పులు ఉన్నాయని, 119 నుంచి 88 నామినేషన్లు ఎలా వచ్చాయని వాదించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తిరుపతయ్య విలేకరులకు వెల్లడించారు. బీఆర్‌ఎస్, బీజేపీ నామినేషన్ల దాఖలులోనూ ఇదే వ్యత్యాసం ఉంది. ఆయా పార్టీల నాయకులు సైతం ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలను పరిశీలించిన పీయూ రిజిస్ట్రార్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పాలమూరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలనుయూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. రమేశ్‌బాబు సోమవారం పరిశీలించారు. అలాగే పీజీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలను పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.చంద్రకిరణ్, హెచ్‌ఓడీ డా.పండుగ రామరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.


