కాంగ్రెస్‌లో బీ ఫామ్ టెన్షన్ !
● ఎమ్మెల్యే బండ్ల, సరిత వర్గాల్లో కలవరం
● టికెట్ దక్కకుంటే పార్టీ మారే యోచనలో నాయకులు
● గెలుపు గుర్రాలకు ఇతర పార్టీల ఎర..
గద్వాలటౌన్: ‘అన్నా.. ఎటూ చెప్పడం లేదు.. చూస్తేనేమో నామినేషన్ దాఖలుకు సమయం మరి కొన్ని గంటలే ఉంది. పార్టీ తరఫున ఒకటి, ఇండిపెండెంట్‌గా మరో నామినేషన్ వెయ్యనా.. తొందరపడితే బీఫామ్ రాకుండా పోతుందా.. ఏమీ తెలుస్తలేదు. వేరే వాళ్లకు టికెట్ ఖరారు చేస్తే నా పరిస్థితి ఏమి.. ఇది కాకపోతే మరో పార్టీ గుర్తు అయినా తెచ్చుకుంటా.. కానీ, ఈ సారి బరిలో నిల్చోవడం పక్కా.. మరోసారి రిజర్వేషన్ అనుకూలిస్తుందో లేదో.. మిమ్మల్నే నమ్ముకుని ఉంటే బీఫామ్ రాకపోతే ఎట్లా..?’ అని గద్వాల కాంగ్రెస్ పార్టీలో ఇంకా టికెట్లు ఖరారు కాని రెండు వర్గాలకు చెందిన పలువురు ఆశావహులు దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు.
వర్గ పోరుతో...
మున్సిపల్ ఎన్నికలు గద్వాల కాంగ్రెస్‌లో కాకలు పుట్టిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ టికెట్లను ఎక్కువ మంది ఆశిస్తున్నారు. ఏడాదిన్నగా గద్వాల కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి వర్గం, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గాలుగా నాయకులు, కార్యకర్తలు వీడిపోయి వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో సైతం ఎవరికివారు పోటీ చేసి ఇరువురు అభ్యర్థులు సత్తాచాటారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో సైతం అదే దూకుడు కనిపిస్తుంది. అయితే పార్టీ పరంగా ఎన్నికలు కావడంతో పార్టీ బీఫాం అభ్యర్థులకు కీలకంగా మారింది. రెండు వర్గాలలో ఎవరికి పార్టీ బీఫాంలు దక్కుతాయోననే చర్చ అందరిలో నెలకొంది. అయితే అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తన వర్గానికే బీఫాం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సరిత సైతం తన వర్గానికి సగం వార్డులో పోటీ చేయడానికి పార్టీ బీఫాం ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎమ్మెల్యే వర్గానికే అన్ని బీఫాంలు వచ్చాయని తెలుస్తుంది. ఆ దిశగానే ఆభ్యర్థులందరూ కాంగ్రెస్ జెండాలతో ప్రచారం నిర్వహించారు. సరిత వర్గానికి పార్టీ బీఫాం ఇవ్వడం లేదనే ప్రచారంతో వారి వర్గీయులు డీలాపడ్డారు. ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ న్యాయం చేస్తుందని, ఎవరు తొందరపడొద్దని సరిత నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భరోసాతో గురువారం సరిత వర్గీయులు కొంతమంది కాంగ్రెస్ పార్టీపై నామినేషన్ల వేశారు. శుక్రవారం అదును చూసుకుని మరో నామినేషన్ వేయడానికి కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ బీఫాంపై ఆశలు సన్నగిల్లుతుండటంతో సరిత వర్గీయులు ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. సందులో సడేమియ్యా అన్నట్లుగా ఆయా వర్గాల్లో పార్టీ బీఫాం రాని అభ్యర్థులకు బీఆర్‌ఎస్ నాయకులు గాలం వేస్తున్నారు. పార్టీ బీఫాం రాకుంటే రెబల్‌గా పోటీ చేయడమా.? లేదా పార్టీ ఫిరాయించడమా అనే దానిపై అసంతృప్తవాదులు మల్లగుల్లాలు పడుతున్నారు.
జంపింగ్‌లకు సిద్ధం..
ఈ సారి మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారే అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీలో అవకాశం దొరకకపోతే కొందరు నాయకులు పార్టీ మారడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది టికెట్ రాని అభ్యర్థులు ఇతర పార్టీలో చేరి బరిలో దిగుతున్నారు. శుక్రవారం నామినేషన్లు వేయడానికి తుది గడువు కావడంతో పార్టీ జంపింగ్‌లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిలో గెలిచే అభ్యర్థులను గుర్తించి వల వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు వలన ఇతర పార్టీలకు బలం చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనవేస్తున్నారు.


