‘అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి’
గద్వాల: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం ఆయన ఐడీఓసీ కార్యాలయం కాన్ఫరెన్స్‌హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ అధికారులకు సహకరించాలన్నారు. అదేవిధంగా నామినేషన్ స్వీకరణకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడమే కాకుండా ఏదైన సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబఽంధించి ఫారం–ఏ శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని సూచించారు. అదేఽవిధంగా నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి ఫారం–బీ ను ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు సమర్పించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే పబ్లిక్ మీటింగులు, ర్యాలీలు, లౌడ్‌స్పీకర్ల వినియోగానికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి, ప్రచార వాహనాలు వినియోగించాలంటే మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


