రైతులు ఆర్థికంగా ఎదగాలి
● కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్ దూబే
గద్వాల/ఎర్రవల్లి: ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన పథకంతో రైతులు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్ దూబే అధికారులను ఆదేశించారు. జిల్లాలో పీఎండీడీకేవై అమలుపై బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటల సాగు, అనుబంధ రంగాలైన మత్స్య, పాడిపరిశ్రమ తదితర రంగాల్లో రాణించేందుకు ఈ పథకం ద్వారా అవసరమైన సహకారం అందించాలన్నారు. బీచుపల్లి వద్ద ఆయిల్‌మిల్లు ఉన్నందున ఆయిల్‌పాం సాగుపై శిక్షణ ఇవ్వాలన్నారు. నాబార్డు ఇతర బ్యాంకింగ్ రంగాలు రైతులకు సబ్సిడీపై అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
● ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణకాంత్ దూబే పర్యటించి పలు పంటలను పరిశీలించారు. ముందుగా తిమ్మాపురంలో రైతులు సాగుచేస్తున్న చేపల చెరువు, బీచుపల్లిలో తెలంగాణ ఆయిల్‌పాం నర్సరీని సందర్శించారు. జిల్లాలో చేపల పెంపకం, ఆయిల్‌పాం సాగు విస్తీర్ణాన్ని తెలుసుకున్నారు. కొండేరులో కూరగాయల తోటలను ఆయన పరిశీలించి.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అమలవుతున్న వివిధ పథకాలు, రుణ సదుపాయాలు, ఈ ప్రాంతంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఇటిక్యాల మండలం మునుగాలలో జాతీయ నూనెగింజల పథకంతో 100 శాతం సబ్సిడీపై అందించిన విత్తనాలతో సాగుచేసిన వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు. మునుగాలలో రైతు శ్రీనివాస్‌రెడ్డి, షాబాద్‌లో రైతు బాలకృష్ణారెడ్డి సాగుచేస్తున్న ఆయిల్‌పాం తోటలను సందర్శించి.. తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, మార్కెటింగ్ తదితర వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఏఓ సక్రియా నాయక్, ఏడీ సంగీతలక్ష్మి, ఉద్యానశాఖ అఽధికారి అక్బర్, ఆయిల్‌ఫెడ్ ఏడీఏ శివనాగిరెడ్డి, పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వర్‌గౌడ్, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి షకీలాభాను, వ్యవసాయ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్‌రెడ్డి, నాబార్డు డీడీఎం షణ్ముఖాచారి, ఇరిగేషన్ అఽధికారి శ్రీనివాస్, ఉద్యానశాఖ డివిజినల్ అధికారులు రాజశేఖర్, ఇమ్రానా, మహేశ్, ఎంఐఈ వినీత్, ఏఓ రవికుమార్, రైతు సంఘం సీఈఓ రఘురామిరెడ్డి పాల్గొన్నారు.


