అభ్యర్థుల వేట షురూ..!
● వ్యూహ ప్రతివ్యూహాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు
● అంతర్గత సమావేశాలతో బిజీ బిజీ
● ఉత్సాహవంతులు,
ప్రజాదరణ ఉన్న వారిపై గురి
గద్వాల టౌన్: పురపాలికల్లో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రకటన వెలువడటంతో ఒక్కసారిగా తేరుకున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. రిజర్వేషన్ల ఆధారంగా వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికకు ప్రాథమిక కసరత్తుకు శ్రీకారం చుట్టాయి. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ద్వితీయ శ్రేణి నాయకులతో సమాలోచనలు జరపడంతో పాటు ఆశావహుల జాబితాను సిద్ధం చేశారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులు.. గెలుపొందే అవకాశాలున్న వారిని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రతి వార్డులో తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని ముగ్గురు, నలుగురు ఉత్సాహం చూపుతుండటంతో ఎంపిక వ్యవహారం క్లిష్టంగా మారుతోంది. కాస్త కఠినంగా వ్యవహరిస్తే ఎక్కడ పార్టీ వీడుతారనే భయం ప్రధాన పార్టీల నాయకులను వెన్నాడుతోంది. ఇప్పటికే కొన్ని వార్డుల్లో అభ్యర్థులను అనధికారికంగా ఖరారు చేసి ప్రచారం చేసుకోవాలని సూచించారు. మరికొన్ని వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఎక్కడ చూసినా చైర్మన్ బరిలో ఏ పార్టీ తరఫున ఎవరు ఉంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు.


