విద్యా సంస్థలకు సెలవు
గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడతల వారీగా ఎన్నికలు జరిగే ఆయా మండలాల్లో పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే గద్వాల, ధరూరు, గట్టు, కేటీ.దొడ్డి మండలాల్లో పోలింగ్ జరిగే ఈ నెల 11వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో అయిజ, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి, మండలాల్లో పోలింగ్ జరిగే ఈనెల 14న ఆదివారంతో పాటు ముందు రోజు 13వ తేదీన శనివారం సాధారణ సెలవులు ఉంటాయని తెలిపారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగే అలంపూర్, ఇటిక్యాల, ఎర్రవల్లి, ఉండవల్లి మరియు మానవపాడు మండలాల్లో పోలింగ్ రోజు ఈనెల 17వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ముందు రోజు 16వ తేదీన అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని,ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని తెలిపారు.
ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులు
గద్వాల: పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయడానికి ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఇందులో ఓటరుకార్డు, ఆధార్, జాతీయ ఉపాధిహామీ జాబ్‌కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీసు లేదా బ్యాంకు పాస్‌బుక్కు, కార్మికమంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్‌కార్డు, డ్రైవింగ్ లెసెన్స్, పాన్‌కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, బీసీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం, ఇండియన్ పాస్‌పోర్టు, ఫొటోతో కూడి పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, రేషన్‌కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లెసెన్స్ పత్రంలో ఏదేని ఒకదానిని చూపి ఓటుహక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరు తప్పకుండా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు.
మెరుగైన విద్యాబోధన చేయాలి
మల్దకల్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని డీఈఓ విజయలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మల్దకల్ కస్తూర్బా బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక బద్దంగా బోధన చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వారి వెంట ప్రత్యేకాధికారి విజయలక్ష్మీ, హంపయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఓయూ విద్యార్థి నాయకుల అరెస్టు అక్రమం
గద్వాల: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య అన్నారు. బుధవారం ఆయన స్థానిక పీజీ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే గొంతునొక్కే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరును మార్చుకుని విద్యార్థుల డిమాండ్‌ను నెరవేర్చాలన్నారు.


