ఎన్నికల్లో పోలీసుల సేవలు ప్రశంసనీయం
ఎర్రవల్లి: స్థానిక సంస్థల మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు పోలీస్ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని బీచుపల్లి పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మల్దకల్, రేవల్లి, కోస్గి, తదితర ప్రాంతాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో పదో బెటాలియన్ ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పోలింగ్‌లో భాగంగా వృద్దులు, దివ్యాంగులకు చేయూతనందించి వారు సురక్షితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకారం అందించారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని వారికి, అవసరమైన చోట తగిన సాయం అందిస్తూ మానవతా దృక్పథంతో పోలీస్ సిబ్బంది వ్యవహరించడంపై ప్రజలు ప్రశంసలు కురిపించారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా సాగేందుకు పోలీసులు ప్రతి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా సాగేందుకు తమ బాధ్యతను నిబద్దతతో నిర్వర్తిస్తూ ఓటర్లకు అండగా నిలిచేందుకు సిబ్బంది చూపిన సేవాభావం, క్రమశిక్షణను అభినందించారు.


