ప్రశాంతంగా తొలివిడత పోలింగ్
గద్వాల: జిల్లాలో మూడు విడతలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు తొలివిడతలో భాగంగా శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. 86.77శాతం పోలింగ్ శాతం నమోదైందని తెలిపారు. మొదటి విడతలో నాలుగు మండలాలైన గద్వాల, ధరూరు, గట్టు, కే.టి.దొడ్డి మండలాల్లో 92 గ్రామపంచాయతీలు, 839వార్డులకు పోలింగ్ జరిగిందన్నారు. 57,476 మంది మహిళలు, 56,786 మంది పురుషులు, ఇతరులు ఒకరు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన
జిల్లాలో మొదటి విడతలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ సరళిని మొదటగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన గద్వాల, ధరూరు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో చేయాలని, ముందుగా పోస్టల్‌బ్యాలెట్ పత్రాలను లెక్కించి తరువాత వార్డు మెంబర్ బ్యాలెట్‌పేపర్లను వేరుచేసి క్రమపద్దతిలో ఓట్లను లెక్కించాలని ఆదేశించారు. అన్ని వార్డుల లెక్కింపులు పూర్తయ్యాకనే సర్పంచు అభ్యర్థుల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలన్నారు. ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుబందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డీఐజీ, ఎస్పీ పర్యవేక్షణ
పోలింగ్ ప్రక్రియను డీఐజీ చౌహాన్ క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన అనంతపురం పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే, ఆలూరు, రాయాపురం, గట్టు గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లను ఏఎస్పీ శంకర్ పరిశీలించారు.
ధరూరు: ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మూడు దశల ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు, ర్యాలీలు నిషేధమని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా గురువారం మండలంలో పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. తొలిదశ ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటికీ గెలిచిన అభ్యర్థులు వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎన్నికల నేపథ్యంలో మూడు దశల ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ కొనసాగుతుందని అన్నారు. ప్రజాస్వామ్య ప్రిక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్చి అన్నారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రజలు, నాయుకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఓటర్లు శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అంతకు ముందు ధరూరులోని ఆయా పోలింగ్ బూత్‌లను సందర్శించి అక్కడి పరిస్థితిని, వివరాలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు.
కోడ్ ముగిసే వరకు
విజయోత్సవాలు నిషేధం
ప్రశాంతంగా తొలివిడత పోలింగ్


