హోరాహోరీ.. ప్రచార భేరి
● రెండు, మూడో విడత పంచాయతీల్లో అభ్యర్థుల విస్తృత ప్రచారం
● గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్న వైనం
అలంపూర్: స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామ ప్రచార హోరుతో అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. మూడు విడతల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఒక విడత పల్లెలు పోలింగ్‌కు సిద్దం అయ్యాయి. మిగిలిన రెండవ, మూడవ విడతల్లో అభ్యర్థులు ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోనే పనిలో నిమగ్నమయ్యారు. ప్రచార పర్వంలో తమ భవిష్యత్తును చూసుకోని వార్డుల వారిగా ఓట్లను అభ్యర్థిస్తు గెలుపుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గ్రామాల్లోని తమకు అనుకులించే అంశాలతోపాటు కలిసొచ్చే వారితో ప్రచారంలో దూసుకెళ్తూన్నారు. అధికారులు నామినేషన్ల నుంచి మొదలుకొని అభ్యర్థులకు గుర్తులు కేటాయించే వరకు పనులు ముగించారు. ఇక మిగిలింది పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కావడంతో వాటిపై దృష్టిసారిస్తున్నారు. అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగిపోగా అధికార యంత్రం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు.
రెండు విడతల్లో అభ్యర్థుల ప్రచార జోరు
జిల్లాలోని 13 మండలాల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో గద్వాల, ధరూరు. కేటీదొడ్డి, గట్టు మండలాలు ఉన్నాయి. మొదటి విడతలో నేడు పోలింగ్ నిర్వహించనుండగా.. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అభ్యర్థులకు ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలింది. దీంతో అభ్యర్థులు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారంతో రక్తి కట్టిస్తున్నారు. మూడో విడతలో అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకుగాను అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. వచ్చిన గుర్తులతో గత రెండు రోజులుగా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు.
రెండో విడతలో 191 మంది సర్పంచ్ అభ్యర్థులు
రెండో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో 191 మంది సర్పంచ్, 965 మంది వార్డుసభ్యులు పోటీపడుతున్నారు. 18 మంది సర్పంచ్ స్థానాలు, 222 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మల్దకల్ మండలానికి వస్తే.. 25 గ్రామ పంచాయతీలు, 242 వార్డులు ఉండగా... 70 మంది సర్పంచ్, 486 మంది వార్డుసభ్యులు పోటీపడనున్నారు. ఇక్కడ 5 సర్పంచ్, 54 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయిజ మండలంలో 28 పంచాయతీలు, 279 వార్డులు ఉండగా.. సర్పంచ్‌కు 78మంది, వార్డులకు 191 మంది పోటీలో నిలిచారు. ఇక్కడ 7 సర్పంచ్, 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వడ్డేపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు, 94 వార్డులకుగాను సర్పంచ్‌కు 13, వార్డులకు 66మంది పోటీపడుతున్నారు. ఇక్కడ 5 సర్పంచ్, 66 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రాజోలి మండలంలో 11 గ్రామ పంచాయతీలు, 110 వార్డులు ఉండగా.. సర్పంచ్‌కు 30మంది, వార్డులకు 222 మంది పోటీపడనున్నారు. ఒక సర్పంచ్, 23 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.


